Omicron: ఒమిక్రాన్‌ను ఎవరూ తప్పించుకోలేరు

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ‘ఆల్‌మోస్ట్‌ అన్‌స్టాపబుల్‌’ (దాదాపు అనివార్యం)గా ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ అభివర్ణించారు...

Published : 12 Jan 2022 09:58 IST

బూస్టర్లు ఆపలేవు.. అంత ప్రమాదకారీ కాదు
 ప్రముఖ వైద్య నిపుణుడు డా।। ములియిల్‌

దిల్లీ: కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ‘ఆల్‌మోస్ట్‌ అన్‌స్టాపబుల్‌’ (దాదాపు అనివార్యం)గా ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ అభివర్ణించారు. ప్రతి ఒక్కరినీ ఈ వేరియంట్‌ పలకరిస్తుందని, మనం భరించలేనంత ప్రమాదకారి మాత్రం కాదన్నారు. కొవిడ్‌ ఇపుడు భయపెట్టేటంత రుగ్మత కాదని, కొత్త వేరియంట్‌తో ఆసుపత్రుల్లో చేరికలు కూడా తక్కువే అన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ శాస్త్రీయ సలహాసంఘ అధ్యక్షుడైన డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒమిక్రాన్‌ సోకినపుడు మనలో 80 శాతం మందికి పైగా ఆ విషయమే తెలియకపోవచ్చు’ అన్నారు. ఈ వైరస్‌ ప్రభావం రెండు రోజుల్లో రెట్టింపు అవుతుందని, ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పారు. ఈ మహమ్మారి సహజ గమనాన్ని అడ్డుకోలేమన్నారు. ‘ప్రభుత్వపరంగా మేమెక్కడా బూస్టర్‌ డోసు కూడా సూచించడం లేదు. ముందు జాగ్రత్త డోసుగా వేసుకోమంటున్నాం అంతే. అదీ ఎందుకంటే.. 60 ఏళ్లు పైబడ్డవారిలో కొందరికి రెండు డోసులతో ఫలితం కనిపించడం లేదు’ అన్నారు. లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షల గురించి మాట్లాడుతూ.. ‘ఎక్కువ రోజులు తలుపులు మూసుకొని ఇళ్లలో కూర్చోలేం. పైగా డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌ ప్రభావం చాలా తక్కువ. మన దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్లు వచ్చేనాటికే 85 శాతం ప్రజలు ఈ మహమ్మారి బారినపడ్డారు. కాబట్టి, మొదటి డోసే మనకు మొదటి బూస్టర్‌ డోసు కింద లెక్క. ఎందుకంటే భారతీయుల్లో చాలామందికి సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది’ అని డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని