Omicron: ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌: డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుడు

Published : 05 Jan 2022 10:39 IST

జెనీవా: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహముద్‌ మంగళవారం పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు. ఇక్కడ ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఇంతకుముందు వేరియంట్లు ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్‌ శరీర పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అయితే పలుచోట్ల పరీక్షలు జరిపే సామర్థ్యం లేకపోవడం వల్ల ఈ వేరియంట్‌ బయట పడలేదని, అక్కడా కూడా ఉండే అవకాశాలున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని