Supreme Court: కుమారుడి పోషణ బాధ్యత తండ్రిదే

విడాకులు మంజూరయినప్పటికీ, మైనార్టీ తీరే వరకు కుమారుణ్ని పోషించే బాధ్యత తండ్రిదేనని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Published : 02 Dec 2021 12:12 IST

విడాకుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: విడాకులు మంజూరయినప్పటికీ, మైనార్టీ తీరే వరకు కుమారుణ్ని పోషించే బాధ్యత తండ్రిదేనని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పోషణ ఖర్చుల కింద మేజర్‌ అయ్యే వరకు కుమారునికి ప్రతి నెలా రూ.50వేల వంతున ఇవ్వాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి, ఆయన భార్యకు మధ్య వివాదంలో ఈ తీర్పునిచ్చింది. వారి గొడవలు ఎలా ఉన్నప్పటికీ, బాలుని చదువు, ఇతర ఖర్చులను తండ్రే భరించాలని కోర్టు ఆదేశించింది. పుట్టినింటిలో ఉన్న తల్లికి ఎలాంటి సంపాదన లేదని గుర్తు చేసింది. సొమ్ము పంపించే ఏర్పాట్లు చూడాలని ఆర్మీ అధికారులను ఆదేశించింది. 

రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై హైకోర్టులను వదిలేయకండి

న్యాయస్థానాల్లో మౌలిక వసతులకయ్యే నిధుల కోసం హైకోర్టులను రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. న్యాయస్థానాల నిర్వహణపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి ఇచ్చిన నివేదికను పరిశీలిస్తూ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రంనాథ్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. కోర్టుల కంప్యూటరీకరణకు కేంద్రం చేసిన ప్రయత్నాలను ప్రశంసించింది. 17వేల కోర్టుల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, న్యాయాధికారులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చినట్టు తెలిపింది. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పుడు పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొంది. సత్వర న్యాయం, మధ్యవర్తిత్వానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున మౌలిక సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఫోరాల్లో ఖాళీలను భర్తీ చేయాలి

గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వినియోగదారుల ఫోరాల్లో పదవుల ఖాళీలను భర్తీ చేయాలని బుధవారం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలవాల్సి ఉంటుందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, రాష్ట్రాలు తమ వాటా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది. నిధులు మురిగిపోకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని