China: చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు..!

భారత్‌లోనే కాదు.. చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పెళ్లి ఈడు అమ్మాయిలు తగినంత మంది లేకపోవడం దీనికి ఒక కారణం.

Updated : 26 Nov 2021 10:34 IST

జీవన వ్యయానికి భయపడుతున్న కుర్రకారు  
పెళ్లీడు అమ్మాయిల కొరత 

బీజింగ్‌: భారత్‌లోనే కాదు.. చైనాలోనూ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పెళ్లి ఈడు అమ్మాయిలు తగినంత మంది లేకపోవడం దీనికి ఒక కారణం. సంసారాన్ని నెట్టుకురావడానికయ్యే వ్యయానికి భయపడి కుర్రాళ్లు ఇప్పట్లో పెళ్లి జోలికే పోబోమని భీష్మించుకు కూర్చుండడం మరో కారణం. దీంతో ముదురు బెండకాయలూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒకవైపు జననాల రేటు, మరోవైపు పెళ్లిళ్ల సంఖ్యా తగ్గిపోతుండగా వృద్ధుల శాతం మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో మున్ముందు వృద్ధుల ఆలనాపాలనా చూసుకోవడం సమస్యగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడచిన ఏడేళ్ల నుంచి పెళ్లిళ్ల నమోదులు తగ్గిపోతూ వస్తున్నాయని ‘చైనా ఇయర్‌ బుక్‌ 2021’ గణాంకాలు తెలిపాయి. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో నిరుడు పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉందని ‘చైనా డైలీ’ తెలిపింది. అధిక జనాభాను తగ్గించడానికి చైనా ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఏక సంతాన విధానానికి 2016లో స్వస్తి చెప్పి, దంపతులు ఇకపై ఇద్దరు పిల్లలను కనవచ్చని ప్రకటించింది. దానివల్ల ప్రయోజనం కనబడకపోవడంతో ఈ ఏడాది ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. యువత అసలు పెళ్లే వద్దంటుంటే ఇక పిల్లల్ని కనే అవకాశం ఎక్కడుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

ఎందుకీ విముఖత?

ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైన ఒత్తిడి, అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం, పెరిగిపోయిన జీవన వ్యయం, చుక్కలను తాకుతున్న ఇళ్ల ధరలు, పిల్లలను పెంచి విద్యాబుద్ధులు చెప్పించడానికయ్యే ఖర్చు నానాటికీ పెరిగిపోవడం వంటి కారణాలు యువతలో పెళ్లి పట్ల విముఖత ఏర్పరుస్తున్నాయి. చైనాలో స్త్రీల కన్నా పురుషుల సంఖ్య 3.49 కోట్లు ఎక్కువ. ముఖ్యంగా 20 ఏళ్ల వయోవర్గంలోనైతే స్త్రీలకన్నా పురుషుల సంఖ్య 17.5 కోట్లు ఎక్కువ. 60 ఏళ్లు పైబడినవారు జనాభాలో 18.7% ఉండగా, 2036కల్లా అది 29.1 శాతానికి పెరుగుతుందని చైనా డైలీ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని