Afghanistan: అఫ్గాన్‌ మధ్యతరగతిలోనూ ఆకలి కేకలు

తాలిబన్ల వశమయ్యాక అఫ్గానిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గతంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న

Published : 23 Nov 2021 10:25 IST

ఉపాధి కరవై రోడ్డున పడుతున్న ప్రజలు 

కాబుల్‌: తాలిబన్ల వశమయ్యాక అఫ్గానిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గతంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న మధ్యతరగతి ప్రజలు సైతం ప్రస్తుతం అకస్మాత్తుగా రోడ్డున పడ్డారు. తాలిబన్లకు తోడు కరోనా వైరస్‌ వచ్చి మీద పడటం, తీవ్ర అనావృష్టితో 3.8 కోట్ల అఫ్గాన్‌ జనాభాలో ఇప్పటికే 22 శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారు. మరో 36 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. నిజానికి 2020లోనే ఆ దేశ జనాభాలో సగం మంది పేదరికంలో మగ్గారు. ప్రస్తుతం పరిస్థితి మరింత విషమించింది. ఇంతకుముందు అమెరికా మద్దతుతో నడచిన ప్రభుత్వం కూడా తరచూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయేది. ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చి మానవ హక్కులను కాలరాయడం, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకపోవడంతో అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌కు ఆర్థిక సహాయాన్ని దాదాపుగా నిలిపేసింది! ఆ దేశ బ్యాంకులను అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ వెలివేసింది. ప్రపంచ దేశాలు తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. దీంతో ప్రస్తుతం తాలిబన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేకపోతోంది. విద్యావైద్యాల వంటి ప్రజా సేవలను నిర్వహించలేకపోతోంది. గతంలో విదేశీ సహాయంతో అఫ్గాన్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు ఇప్పుడు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ 40 శాతం మేర కుంచించుకుపోయింది. ఒకప్పుడు భద్రమైన ఉద్యోగాలు చేసుకున్నవారు కూడా నేడు పూట గడవని దుస్థితిలోకి జారిపోయారు. 

మానవతా దృష్టితో సహాయం 

అఫ్గాన్లను ఆదుకోవడానికి అమెరికా తదితర విదేశీ ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తున్నా, ఆ నిధులను తాలిబన్‌ ప్రభుత్వానికి కాకుండా ఐక్యరాజ్య సమితి సంస్థలకు అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌లు అఫ్గాన్‌ వైద్యులు, నర్సులకు జీతాలు చెల్లిస్తూ, దేశ ఆరోగ్య రక్షణ యంత్రాంగం కుప్పకూలకుండా చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (డబ్ల్యూఎఫ్‌పీ) అఫ్గాన్‌ ప్రజలకు ఆహారం, నగదు అందిస్తూ వారిని ఆకలి చావుల బారి నుంచి కాపాడటానికి కృషి చేస్తోంది. నిరుడు 90 లక్షలమందికి నగదు, ఆహారం అందించిన డబ్ల్యూఎఫ్‌పీ ఈ ఏడాది 1.4 కోట్లమందిని ఆదుకుంది. వచ్చే ఏడాది 2.3 కోట్లమందికి సహాయాన్ని విస్తరించదలచింది. అది సాధ్యపడాలంటే నెలకు 22 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అవసరమంటోంది. గ్రామీణ పేదలే కాదు, పట్టణ మధ్యతరగతి కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితిలోకి జారిపోతోందని డబ్ల్యూఎఫ్‌పీ తెలిపింది. అఫ్గాన్లకు ఆహారంతోపాటు ముఖ్యమైన ఖర్చుల కోసం నగదు సహాయమూ ఇవ్వడానికి ఐరాస నడుం కట్టింది. గతవారం కాబుల్‌లో ఒక వ్యాయామశాలలో 38 డాలర్ల నెలసరి నగదు సహాయం పొందడానికి వందలాది అఫ్గాన్‌ ప్రజలు బారులు తీరి కనిపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని