Covid Vaccine: టీకా స్వచ్ఛందం కాదు.. నిర్బంధం!

దేశంలో వయోజనులంతా కొవిడ్‌ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది.

Published : 14 Nov 2021 11:21 IST

తప్పనిసరి చేస్తున్న స్థానిక సంస్థలు, కంపెనీలు
లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో 26% మంది వెల్లడి

దిల్లీ: దేశంలో వయోజనులంతా కొవిడ్‌ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది. ఇదే విషయాన్ని అక్టోబరు 8న బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లోనూ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా పలు స్థానిక సంస్థలు, సంఘాలు, కంపెనీలు మాత్రం తమ పరిధిలోని వారంతా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ‘లోకల్‌ సర్కిల్స్‌’ తాజా సర్వేలో.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఇదే విషయం చెప్పారు. సర్వే కోసం 328 జిల్లాల్లో 36 వేల మంది అభిప్రాయాలను సేకరించగా.. 26% మంది తమ స్థానిక ప్రభుత్వాలు టీకాను తప్పనిసరి చేశాయని వెల్లడించారు. 29% మంది తమ కాలనీ/మార్కెట్‌/సొసైటీలలో అందరికీ టీకా తప్పనిసరి చేశారని, ధ్రువీకరణ పత్రం కూడా చూపమంటున్నారని చెప్పారు. కంపెనీలు, ఉద్యోగుల యాజమాన్యాలు కూడా ఇదే వైఖరితో ఉన్నట్టు 40% మంది తెలిపారు. మరో 13% మంది మాత్రం తమ యాజమాన్యాలు టీకా తప్పక వేసుకోవాలని చెబుతున్నా బలవంతం చేయడం లేదన్నారు. అలాగే కొన్నిచోట్ల స్థానిక పరిపాలనాధికారులు.. టీకా వేసుకోని పౌరులకు కొన్ని ప్రయోజనాలను ఆపేస్తున్నట్టు కూడా సర్వేలో తేలింది. ఉదాహరణకు.. ఔరంగాబాద్‌ జిల్లాలో ఒక్క డోసు టీకా కూడా తీసుకోనివారికి రేషన్‌ దుకాణాలు, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ పంపుల్లో సేవలు బంద్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ సైతం.. టీకా వేసుకోని ఉద్యోగులు, అధికారులు జీతాలు ఆపేస్తామని ఏకంగా ఉత్తర్వులిచ్చింది. టీకా విషయంలో ప్రజల్ని చైతన్యపరచాలే తప్ప ఎలాంటి బలవంతం చేయకూడదన్న కేంద్రం వైఖరిపైనా తమకు అవగాహన ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది చెప్పారు.

వ్యాక్సిన్‌ తీసుకుంటేనే బస్సులోకి అనుమతి ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాజా నిర్ణయం

ఠాణె: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోని తమ సిబ్బందికి జీతాలు చెల్లించేది లేదని ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(టీఎంసీ) తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ప్రజలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. నవంబరు చివరి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘కార్పొరేషన్‌ పరిధిలో వ్యాక్సిన్‌ తీసుకోని వారు కనిపిస్తే వెంటనే సమీప కేంద్రంలో వారికి టీకాలు వేయిస్తాం. టీకాలు తీసుకున్న వారు బస్సుల్లో ప్రయాణించాలంటే తమ వెంట వ్యాక్సిన్‌ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకువెళ్లాలి. లేదంటే వారిని బస్సులోకి అనుమతించబోం’’ అని టీఎంసీ అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని