Internet Users: దేశంలో 47% నెటిజన్లు.. నాలుగేళ్లలో 40% పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ వాడకందారుల సంఖ్య 

ప్రస్తుతం దేశంలో ఇంటర్‌నెట్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య 47%కి చేరింది. 15ఏళ్ల వయసు పైవారిలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో 2017లో 19% 

Published : 14 Nov 2021 11:11 IST

పాఠశాలలు మూసేసిన సమయంలో 20% మందికే సాధారణ విద్య
ఎల్‌ఐఆర్‌ఎన్‌ఈ ఏసియా, ఐసీఆర్‌ఐఈఆర్‌ సంస్థల సర్వేలో వెల్లడి 

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం దేశంలో ఇంటర్‌నెట్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య 47%కి చేరింది. 15ఏళ్ల వయసు పైవారిలో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో 2017లో 19% ఉండగా, 2021 నాటికి 47%కి చేరింది. ఇందులో దిల్లీ (72%), మహారాష్ట్ర (55%), తమిళనాడు (53%), అస్సాం (37%) ముందున్నాయి. లెర్నింగ్‌ ఇనిషియేటివ్స్‌ ఇన్‌ రీఫామ్స్‌ ఫర్‌ నెట్‌వర్క్‌ ఎకనామిస్‌ ఏసియా(ఎల్‌ఐఆర్‌ఎన్‌ఈ ఏసియా), ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) సంస్థల సంయుక్త సర్వేలో ఈ విషయాలు తేలాయి. కెనడాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆర్థిక సాయంతో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 7 వేల మంది నుంచి వివరాలు సేకరించి అందులో వచ్చిన ఫలితాలను వెల్లడించారు. 2020-21లోనే 13.2కోట్లమంది ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 57% మంది పురుషులు, 36% మంది మహిళలు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో వినియోగం 55%మేర ఉండగా, గ్రామీణప్రాంతాల్లో అది 44%కి పరిమితమైంది. అందులోనూ 15-25 ఏళ్ల మధ్యవయసువారిలో 71% మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ దాని వినియోగం తగ్గిపోతోంది. ఉన్నత విద్య చదివిన వారిలో 89% ఇంటర్‌నెట్‌ వినియోగిస్తుండగా, చదువులేని వారిలో అది 9%కే పరిమితమైంది. ఉద్యోగం ఉన్నవారిలో 54%, నిరుద్యోగుల్లో 44% ఇంటర్‌నెట్‌ వాడుతున్నారు. 2017లో నెట్‌ వినియోగంలో పట్టణ-గ్రామీణప్రాంతాల మధ్య గ్యాప్‌ 48%మేర ఉండగా, ఇప్పుడు అది 20%కి తగ్గింది. 

- గత నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారి సంఖ్య 40%మేర పెరిగింది. 2017లో 55% మంది వద్ద బేసిక్, 16% మంది వద్ద ఫీచర్, 28% మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండగా, ఇప్పుడు ఆ నిష్పత్తి 26%, 6%, 68%కి చేరింది. 

ఇంటర్నెట్‌ అంటే ఏంటో తెలియదన్న వారి సంఖ్య 2017లో 82% మేర ఉండగా.. ఇప్పుడు 49%కి తగ్గింది. నెట్‌ వినియోగం గురించి తెలియదన్నవారి సంఖ్య ఈ కాలంలో 3% నుంచి 18%కి పెరిగింది.  

దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాంలలో జాతీయ సగటుకి మించి 62% ఇళ్లకు ఇంటర్‌నెట్‌ ఉంది. 

- 74% ఇళ్లలో టీవీలు, 68% ఇళ్లలో స్మార్ట్‌ఫోన్లు, 61% ఇళ్లలో బేసిక్‌ఫోన్లు, 52% ఇళ్లలో కేబుల్‌టీవీ, 26% ఇళ్లలో ఫీచర్‌ఫోన్లు, 9% ఇళ్లలో ల్యాండ్‌లైన్లు, 9% ఇళ్లలో రేడియో, 5% ఇళ్లలో ల్యాప్‌ట్యాప్, 4% ఇళ్లలో డెస్క్‌టాప్‌ సౌకర్యాలున్నాయి. 

కొవిడ్‌కు ముందు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల్లో కేవలం 20% మందికే పాఠశాలలు మూసేసిన సమయంలో సాధారణ విద్య అందింది. మిగిలిన 80% మంది అందుకు దూరమయ్యారు. 

- లాక్‌డౌన్‌లో ఒకటో తరగతి వారు 11%, రెండోతరగతి 14%, మూడో తరగతి 18%, నాలుగో తరగతి 17%, అయిదో తరగతి 15%, ఆరోతరగతి 23%, ఏడు, ఎనిమిదో తరగతుల్లో 20%, 9వ తరగతి 21%, పదో తరగతి 26%, పదకొండో తరగతి 33%, 12వ తరగతిలో 29% మందికే ఆన్‌లైన్‌ విద్య అందింది. 

 పాఠశాలలు మూసేసిన సమయంలో  55% మంది పిల్లలు మాత్రమే టీచర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ అందుకున్నారు. టీచర్లతో ఇంటరాక్ట్‌కావడానికి 76% మంది పిల్లలు వాట్సప్‌ను ఉపయోగించుకున్నారు.

కొవిడ్‌ సమయంలో 75% మంది పిల్లలు వాట్సప్, 69% మంది ఫోన్‌కాల్, 68% మంది రేడియో, వీడియో, 61% మంది ఎస్‌ఎంఎస్, 58% మంది ఇంటికే ఫిజికల్‌రూపంలో వచ్చిన మెటీరియల్, 55% మంది లైన్‌ ఆన్‌లైన్, 52% మంది టీవీప్రోగ్రాం, 46%మంది రేడియో ద్వారా చదువు కొనసాగించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని