Covaxin: కొవిడ్‌ తీవ్ర లక్షణాలు సోకకుండా కొవాగ్జిన్‌తో 93.4 శాతం రక్షణ

దేశీయంగా భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌.. కొవిడ్‌ తీవ్ర లక్షణాల నుంచి 93.4 శాతం కాపాడే సామర్థ్యాన్ని కనబరిచిందని

Updated : 12 Nov 2021 17:08 IST

హైదరాబాద్‌: దేశీయంగా భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌.. కొవిడ్‌ తీవ్ర లక్షణాల నుంచి 93.4 శాతం కాపాడే సామర్థ్యాన్ని కనబరిచిందని ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ కథనం వెల్లడించింది. ఈ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను జర్నల్‌లో ప్రచురించారు. ఈ కథనం ప్రకారం.. ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో 0.5 శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తాయి. 

ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రబలరూపకంగా ఉన్న డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం కాపాడగలిగే సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. దీనికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అన్ని రకాల కొవిడ్‌ స్ట్రైన్స్‌ నుంచి 70.8 శాతం రక్షణ ఇస్తుంది. 

కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల్లో దేశవ్యాప్తంగా 25 వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 25,800 మంది పాల్గొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిమిత్తం భారత్‌లో జరిగిన అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్స్‌ ఇదేనని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. కొవాగ్జిన్‌ సామర్థ్యం, క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలు దాదాపు 10 కీలక జర్నల్స్‌లో ప్రచురితమైనట్లు కంపెనీ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యధిక జర్నల్స్‌లో ప్రచురితమైన టీకాల్లో ఒకటిగా కొవాగ్జిన్‌ నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సహకారం అందడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్‌ 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఈ ఘనత సాధించడం ఆత్మనిర్భర్‌ భారత్‌ శక్తిని తెలియజేస్తోందన్నారు. 

కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ టీకాల జాబితాలో డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవలే చేర్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాల్లో ఈ టీకా వినియోగానికి మార్గం సుగమమైంది. అంతకంటే ముందే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50కి పైగా దేశాల్లో ఈ టీకా వినియోగానికి ఆయా నియంత్రణా సంస్థలు అనుమతినిచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని