భేషుగ్గా బడులు తెరవొచ్చు.. విద్యార్థులు నిస్సంకోచంగా తరగతులకు వెళ్లవచ్చు

దేశంలో పాఠశాలల పునఃప్రారంభానికి ఎలాంటి సంకోచం అవసరంలేదని, విద్యార్థులు నిర్భయంగా తరగతి గదులకు హాజరు

Updated : 06 Nov 2021 11:26 IST

వారిలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త సమీరన్‌ పాండా

దేశంలో పాఠశాలల పునఃప్రారంభానికి ఎలాంటి సంకోచం అవసరంలేదని, విద్యార్థులు నిర్భయంగా తరగతి గదులకు హాజరు కావచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సమీరన్‌ పాండా తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు బడులను తెరవాలని ఆయన కోరారు. ఇతర దేశాల్లో వైరస్‌ వ్యాప్తి మనల్ని కలవరానికి గురిచేస్తుందన్నారు. ఐసీఎంఆర్‌లోని అంటు వ్యాధుల విభాగాధిపతి కూడా అయిన డాక్టర్‌ సమీరన్‌ పాండా ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. విద్యార్థులు కరోనా వైరస్‌ వాహకులు కాదని స్పష్టం చేశారు. ‘తొలి విడత కొవిడ్‌ విజృంభణ సమయంలో పాఠశాలల మూసివేత హేతబద్ధమైన చర్యే. రెండో దశ వ్యాప్తి అప్పుడు పాఠశాలలు మూసివేసే ఉన్నాయి. అయినప్పటికీ చిన్నారులకు వైరస్‌ సోకింది. దీనిని బట్టి పాఠశాలల పునఃప్రారంభానికి, విద్యార్థులకు కరోనా రావడానికి సంబంధమే లేదని స్పష్టమవుతోంది’ అని అన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తుండడంతో దేశంలోని అనేక జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలను తెరవడానికి అధికారులు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో డాక్టర్‌ సమీరన్‌ సూచన పరిశీలనార్హమైనదే. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగు జాగ్రత్తలతో పాఠశాలలను నడుపుతున్నాయి.
‘నాల్గవ జాతీయ సెరో సర్వే ప్రకారం పాఠశాలలు మూసివేసి ఉన్నప్పటికీ చాలా మంది పిల్లలకు కరోనా సోకింది. అనేక మందిలో వైరస్‌ ప్రతిరక్షకాలు కనిపించాయి. విద్యార్థులను బడికి పంపిస్తే వారికి కరోనా సోకుతుందనే భయం అనవసరం. దేశంలో విద్యా సంస్థల ప్రారంభానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి’ అని డాక్టర్‌ సమీరన్‌ పాండా స్పష్టం చేశారు. మన దేశంలో తయారైన రెండు టీకాలూ సురక్షితమైనవేనన్నారు. దేశంలో కొత్త వైరస్‌ వేరియంట్లు ఏమీ లేవని తెలిపారు. ‘దేశంలో ఇప్పటికే చాలా మంది వైరస్‌ బారిన పడ్డారు. అత్యధికులకు వ్యాధినిరోధకత కూడా సమకూరింది. ఈ పరిస్థితుల్లో మరోసారి వైరస్‌ అంతగా ప్రభావం చూపకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. టీకాల కార్యక్రమంలో వెనుకబడిన రాష్ట్రాలకు మాత్రం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత పండగల సీజన్‌లో కరోనా కేసుల సంఖ్య కొంత వరకు పెరగవచ్చని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని