Pegasus: ఎన్‌ఎస్‌వోను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా

రక్షణ అవసరాల కోసమంటూ పెగాసస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన

Published : 04 Nov 2021 14:33 IST

‘పెగాసస్‌’ వివాదం నేపథ్యంలోనే..

వాషింగ్టన్‌: రక్షణ అవసరాల కోసమంటూ పెగాసస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ను అమెరికా అధికారులు బుధవారం బ్లాక్‌లిస్ట్‌ (నిషేధిత కంపెనీల జాబితా)లో చేర్చారు. అధికారులు, పాత్రికేయులపై నిఘా ఉంచేందుకు ఈ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మానవహక్కుల కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులపై పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ప్రభుత్వాలు నిఘా ఉంచుతున్నాయన్న వార్తలు వెలువడడంతో ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి ఫోన్‌లోకి ఒక్కసారి పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రవేశిస్తే.. అతనికి తెలియకుండా ఫోన్‌లోని సందేశాలను చదవడంతోపాటు ఫొటోలను చూడవచ్చు. అవసరమైతే కెమెరాను సైతం యజమానికి తెలియకుండా ఆన్‌ చేయడం, అతను ఏఏ ప్రాంతాల్లో తిరిగాడు తదితర అంశాలను తెలుసుకోవడం వంటివీ సాధ్యమే. ‘‘ఈ టూల్స్‌ సహాయంతో విదేశీ ప్రభుత్వాలు అంతర్జాతీయస్థాయిలో అణచివేత ప్రక్రియలకు పాల్పడవచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ సార్వభౌమ సరిహద్దులకు ఆవల ఉన్న అసమ్మతి గళాలను, పాత్రికేయులను, ఉద్యమకారులను అణచివేయడానికి ఇవి ఉపకరిస్తాయి’’ అని అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని