Updated : 02/11/2021 11:17 IST

COP26: విధ్వంసాన్ని జేమ్స్‌ బాండ్‌లా అడ్డుకుందాం: బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌

వినాశకర బలిపీఠంపై ప్రపంచం

గ్లాస్గో: ఐరాస వాతావరణ సదస్సు (కాప్‌26)లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. 120కిపైగా దేశాల ప్రభుత్వాధిపతులు, దేశాధ్యక్షులు పాల్గొంటున్న ‘ప్రపంచ నేతల సదస్సు’ (డబ్ల్యూఎల్‌ఎస్‌) సోమవారం బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా అనేకమంది నాయకులు పాలుపంచుకుంటున్నారు. ఈ సదస్సును బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవడానికి సమయం మించిపోతోందన్నారు. ఆ దిశగా ఈ భేటీ.. జేమ్స్‌ బాండ్‌ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోందంటూ సినిమాల్లో ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే వ్యక్తులతో ఆ సీక్రెట్‌ ఏజెంటు సాగించే పోరాటాలను ప్రస్తావించారు. నేడు వినాశకర బలిపీఠం(డూమ్స్‌డే డివైస్‌)పై ప్రపంచం మొత్తం ఉందన్నారు. దాన్ని నిర్వీర్యం చేయడం ఎలా అనేదానిపై అందరం తలమునకలై ఉన్నామని చెప్పారు. ‘‘జేమ్స్‌ బాండ్‌ తరహా పరిస్థితినే మనం ఎదుర్కొంటున్నాం. విషాదమేంటంటే ఇది సినిమా కాదు. ప్రపంచాన్ని నాశనం చేసే యంత్రమూ ఊహాజనితం కాదు.. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇక్కడ ముప్పు. 250 ఏళ్ల క్రితం గ్లాస్గోలో జేమ్స్‌ వాట్‌.. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. అది బొగ్గును మండించటం ద్వారా నడుస్తుంది. దానిని మనం ‘డూమ్స్‌ డే యంత్రం’ స్థాయికి తీసుకొచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతమున్న ప్రపంచ ఉష్ణోగ్రతలకు అదనంగా 2 డిగ్రీల సెల్సియస్‌ చేరితే ఆహార సరఫరాకు విఘాతం కలుగుతుందని జాన్సన్‌ హెచ్చరించారు. ‘‘అదే 3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే మరిన్ని కార్చిచ్చులు, తుపాన్లు ఉత్పన్నమవుతాయి. 4 డిగ్రీలకు చేరితే ప్రపంచవ్యాప్తంగా నగరాలకు నీళ్లొదులుకోవాల్సిందే. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయకుంటే ఈ విపరిణామాలు తప్పవు. అమెరికాలోని మయామీ, చైనాలోని షాంఘై నగరాలు సముద్రం పాలవుతాయి. మనం దిద్దుబాటు చర్యల్లో ఎంత జాప్యం చేస్తే.. నష్టం అంత తీవ్రంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు సంబంధించిన ‘గడియారం’ విషయంలో మానవాళి ఇప్పటికే చాలా జాప్యం చేసింది’’ అని పేర్కొన్నారు.

హామీలు ‘బ్లా.. బ్లా..’ కాకూడదు
భూతాపం కట్టడి విషయంలో రాజకీయ నేతలు చేసిన డొల్ల హామీలను ఎద్దేవా చేస్తూ పర్యావరణ ఉద్యమకారణి గ్రెటా థన్‌బర్గ్‌ ఇటీవల చేసిన ‘బ్లా.. బ్లా.. బ్లా..’ వ్యాఖ్యలను జాన్సన్‌ ప్రస్తావించారు. ప్రపంచ నేతలు తమ హామీలను నిలబెట్టుకోకుంటే అవన్నీ డొల్లగానే మిగిలిపోతాయని ఆయన హెచ్చరించారు. ‘‘మన పనితీరును భవిష్యత్‌ తరం విశ్లేషిస్తుంది. మనం విఫలమైతే వారు క్షమించరు. చరిత్రాత్మక మలుపునకు గ్లాస్గో సదస్సులో ఒక అవకాశం వచ్చినప్పటికీ.. అలాంటి మలుపు చోటుచేసుకోలేదని వారు గుర్తిస్తారు’’ అని తెలిపారు.

పశ్చిమ దేశాలకు బాధ్యత
వాతావరణ మార్పుల విషయంలో పశ్చిమ దేశాలకు ఎక్కువ బాధ్యత ఉందని జాన్సన్‌ పేర్కొన్నారు. ‘‘200 ఏళ్లుగా పారిశ్రామిక దేశాలు తమ ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలను పెడచెవిన పెట్టాయి. పారిస్‌లో ఇచ్చిన మాట ప్రకారం పేద దేశాలకు ఏటా 100 బిలియన్‌ డాలర్లు సాయం చేసేందుకు మనం కృషి చేయాలి. అయితే 2023లోగా అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడంలేదు’’ అని తెలిపారు. ఇప్పుడు ప్రపంచానికి హరిత పారిశ్రామిక విప్లవం అవసరమన్నారు. బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ కూడా ఈ సదస్సులో ప్రసంగించారు. వాతావరణ సంక్షోభానికి వినూత్న పరిష్కారాలను కనుగొనాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నేతలు.. 2015లో పారిస్‌లో కుదిరిన ఒప్పందంలో అంగీకరించిన లక్ష్యాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు తమ హామీలను ప్రకటించనున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని