Published : 20/10/2021 10:32 IST

Jammu and Kashmir: ఉండిపోతే ప్రాణభయం.. ఊరెళ్తే పస్తుల పర్వం

కశ్మీర్‌ను వీడుతున్న వలస కూలీల అంతర్మథనం

ఉగ్ర దాడులతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు పోటెత్తిన స్థానికేతరులు

జమ్మూ: ‘వెళ్లొస్తాను భాయ్‌..’ అంటూ యజమానులకు, స్నేహితులకు నిర్వేదంగా వీడ్కోలు చెబుతున్న వేలమందిలో ఒక్కటే ప్రశ్న. వెళ్తున్నాం కానీ మళ్లీ వచ్చేదంటూ ఉంటుందా అని. ఊరెళ్తున్నాం కానీ ఉపాధి ఉంటుందా అని. ఉగ్రదాడుల భయంతో కశ్మీర్‌ లోయను వీడుతున్న వలస కూలీల పరిస్థితి ఇది.

జమ్మూ-కశ్మీర్‌లో పౌరులు, స్థానికేతరులపై జరుగుతున్న ఉగ్రదాడులతో ప్రజలు క్షణక్షణ గండంలా గడుపుతున్నారు. ఎక్కడెక్కడినుంచో పొట్టచేతపట్టుకుని వచ్చిన వలస కూలీలు ప్రాణభయంతో కుటుంబాలతో సహా లోయను వీడి వెళ్తున్నారు. మంగళవారం వేల మంది కూలీలు శ్రీనగర్, జమ్మూ, ఉధంపుర్‌లలోని రైల్వే స్టేషన్లు, బస్టాండులకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భద్రత పెంచారు. టికెట్‌ కౌంటర్ల వద్ద పురుషులతో పాటు మహిళలు, పిల్లలు కూడా పొడవాటి వరుసల్లో నిల్చొని గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌ల నుంచి ఏటా మార్చిలో సుమారు 4 లక్షల మంది ఉపాధి కోసం కశ్మీర్‌కు వెళ్తుంటారు. యాపిల్‌ తోటల్లో కూలీలుగా, క్రికెట్‌ బ్యాట్ల తయారీ, అట్టపెట్టెల పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. పనులు పూర్తయ్యాక నవంబరు ఆరంభంలో వీరు తమ సంపాదన చేతపట్టుకుని సంతోషంగా స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఉగ్రదాడుల భయంతో అంతకన్నా ముందే వెళ్లిపోతున్నారు. దీనికితోడు సొంత ఊళ్లకు వెళ్లాక కడుపు నింపుకోవడమెలా అన్న ప్రశ్న వీరిని వేధిస్తోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా కొందరు పనుల కోసం అక్కడి వీధుల్లో నిల్చొని ఎదురుచూస్తున్నారు.

మా నాన్నను చంపారు.. మేమెలా బతకాలి

‘ఉగ్రవాదులు మా నాన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు మేమెలా బతకాలి’ అని కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు జహంగీర్‌ అన్సారీ. దక్షిణ కశ్మీర్‌లో శనివారం ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వడ్రంగి సగీర్‌ అన్సారీ కుమారుడు జహంగీర్‌. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారి కుటుంబం సగీర్‌ సంపాదనపైనే బతికేది. ఇప్పుడు అతడు దూరం కావడంతో వారి ఉపాధి ప్రశ్నార్థకమైంది. సగీర్‌ మృతదేహాన్ని తమ ఇంటికి చేర్చడానికి కూడా అధికారులు సాయం చేయలేదని, తామే కశ్మీర్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చిందని జహంగీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సరిహద్దు ప్రాంతాల్లో నరవణె పర్యటన

ఉగ్రవాదుల దాడులు, వారిని మట్టుబెట్టడానికి భద్రత దళాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాలను మంగళవారం సందర్శించి సమీక్షించారు.

జవాన్‌ అనుమానాస్పద మృతి

సీఆర్పీఎఫ్‌ జవాను ఒకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రంబన్‌ జిల్లాలోని 84వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజీవ్‌ రంజన్‌ తలకు గాయంతో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. అతడు సర్వీస్‌ రివాల్వర్‌లో కాల్చుకుని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ప్రజలకు భద్రత దళాల ఆదేశం

జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో భద్రత దళాలు ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నాయి. ఇక్కడి మెంధార్‌ అటవీప్రాంతంలో ముష్కరులు దాక్కున్నారన్న సమాచారంతో 9 రోజులుగా జల్లెడపడుతున్నారు. ఇక్కడే ఇటీవల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 9 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున కాల్పులు జరగొచ్చన్న అంచనాలతో భద్రత దళాలు సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశాయి. అందరూ ఇళ్లలోనే ఉండాలని, పెంపుడు జంతువులను కూడా బయటకు వదలకూడదని ప్రకటించాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని