Queen Elizabeth II: మహారాణి మరణిస్తే కిం కర్తవ్యం?

బ్రిటన్‌ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్‌-2 (95) మరణిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తొచ్చు?

Updated : 04 Sep 2021 09:38 IST

ఎలిజబెత్‌ మరణానంతరం చేపట్టే ఆపరేషన్‌ పత్రాలు లీక్‌! 
కట్టుదిట్ట భద్రతతోపాటు మరిన్ని చర్యలకు అందులో ప్రణాళిక

లండన్‌: బ్రిటన్‌ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్‌-2 (95) మరణిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తొచ్చు? అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆమె పార్థివ దేహానికి ఎప్పుడు అంత్యక్రియలు చేయాలి? ఇలా ఎన్నో విషయాలపై ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు లీకైన పత్రాల ద్వారా తెలుస్తోంది. ‘ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌’తో రూపొందించిన ఈ ప్రణాళిక పత్రాలు తమ చేతికి అందినట్లు అమెరికాకు చెందిన వార్తా సంస్థ ‘పొలిటికో’ వెల్లడించింది. ఎలిజబెత్‌ రాణి మరణించిన రోజును ‘డీ డే’గా పేర్కొనాలని అందులో వివరించారు. ఆ పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం రాణి తుది శ్వాస విడిచిన 10 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ వ్యవధిలో ఆమె కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ యూకే పర్యటన చేస్తారు. రాణి పార్థివ దేహాన్ని పార్లమెంటు భవనంలో మూడు రోజుల పాటు సందర్శనకు ఉంచుతారు.

ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లక్షల మంది జనం లండన్‌కు పోటెత్తవచ్చని, దీనివల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగొచ్చని అధికారులు భావిస్తున్నట్లు ఆ పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆరోజు నగరంలో ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనాలను నియంత్రించడానికి, అంతిమ యాత్రకు ఆటంకాలు కలగకుండా చూడడానికి పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించే యోచనతో ఉన్నారు. సెయింట్‌ పాల్‌ చర్చిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తన అంత్యక్రియలు జరిపే రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించేలా రాణికి, బ్రిటన్‌ ప్రధానికి మధ్య ఒప్పందం కుదిరిందని ఆ పత్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పత్రాలు లీక్‌ అయినట్లు కానీ, లేదా అలాంటి ప్రణాళికలు ఉన్నట్లు కానీ ధ్రువీకరించడానికి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు నిరాకరించాయి. 2017లోనూ ‘ది గార్డియన్‌’ పత్రిక ‘ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌’పై ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ప్రిన్స్‌ ఛార్లెస్‌ను రాజుగా ఎలా ప్రకటించాలన్నదానిపై వివరాలు ఉన్నట్లు పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని