Updated : 27/08/2021 10:35 IST

Govt Eases Drone Rules: 5దరఖాస్తులు.. 4రకాల రుసుములు

దేశంలో డ్రోన్ల నిర్వహణ ఇక సులువు

ఇది కీలక మైలురాయి: ప్రధాని

దిల్లీ: దేశంలో డ్రోన్‌ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర పౌర విమానయాన శాఖ సడలించింది. ఈ లోహ విహంగాలను నిర్వహించడానికి నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి ఐదుకు కుదించింది. అలాగే ఒక్కో ఆపరేటర్‌ నాలుగు రకాల రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం 72 రకాల ఛార్జీలను వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధనలు ఈ రంగంలో మైలురాయిలా నిలిచిపోతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘నమ్మకం, స్వీయ ధ్రువీకరణ ప్రాతిపదికన వీటిని తెచ్చాం. ఆమోదాలు, కట్టుబడాల్సిన నిబంధనలు, ప్రవేశ అవరోధాలను గణనీయంగా తగ్గించాం’’ అని తెలిపారు. అంకుర పరిశ్రమలకు, ఈ రంగంలో పనిచేసే యువతకు ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ నిబంధనలు సరకు బట్వాడాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, మైనింగ్‌ వంటి రంగాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఎయిర్‌ ట్యాక్సీలకూ ఇది మార్గం సుగమం చేస్తుందన్నారు. ‘‘మనం రోడ్లపై చూస్తున్న ఉబర్‌ వంటి ట్యాక్సీలు గగనతలంలోనూ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని పేర్కొన్నారు.  
డ్రోన్‌ నిబంధనలు-2021 పేరిట పౌర విమానయాన శాఖ వీటిని జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మానవ రహిత విమాన వ్యవస్థల నిబంధనలు-2021 స్థానంలో వీటిని తెచ్చింది. వీటి ప్రకారం..

డ్రోన్‌ నిర్వాహకులు చెల్లించాల్సిన రుసుములు ఇక నామమాత్రంగానే ఉంటాయి. ఈ ఛార్జీలకు లోహ విహంగాల పరిమాణంతో ఇక సంబంధం ఉండదు. ఉదాహరణకు.. రిమోట్‌ పైలట్‌ లైసెన్సు కోసం రుసుమును రూ.3వేల (భారీ డ్రోన్‌కు) నుంచి రూ.100కు (అన్ని విభాగాల డ్రోన్లకు) తగ్గించారు.
కనఫార్మెన్స్, నిర్వహణ, దిగుమతి క్లియరెన్స్‌ ధ్రువీకరణ పత్రాలు, ఆపరేటర్‌ పర్మిట్, ఆర్‌ అండ్‌ డీ సంస్థ ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్‌ పైలట్‌ లైసెన్సు, విశిష్ట అథీకృత సంఖ్య, విశిష్ట ప్రొటోటైప్‌ గుర్తింపు సంఖ్య, గగనయాన సామర్థ్య సర్టిఫికెట్‌ వంటివి అవసరం లేదు.
‘గ్రీన్‌ జోన్‌’లలో 400 అడుగుల ఎత్తు వరకూ ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే డ్రోన్లను నడుపుకోవచ్చు. విమానాశ్రయ ప్రహరీగోడ నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతంలో 200 అడుగుల ఎత్తు వరకూ వీటిని నిర్వహించుకోవచ్చు. గగనతల మ్యాప్‌లో రెడ్, యెల్లో జోన్లకు వెలుపలి ప్రదేశాల్లో 400 అడుగుల ఎత్తు వరకూ ఉండే ప్రాంతాన్ని గ్రీన్‌ జోన్‌గా పేర్కొంటారు.  
డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్‌లను సరళీకరించారు.
మైక్రో డ్రోన్ల (వాణిజ్యేతర అవసరాలకు), నానో డ్రోన్ల ఆపరేటర్లకు పైలట్‌ లైసెన్సు అవసరం లేదు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి విధించే గరిష్ఠ జరిమానాలను రూ.లక్షకు తగ్గించారు.
డ్రోన్‌ను భారత్‌లో నడపాలనుకున్న సందర్భంలోనే అది ఏ రకానికి చెందింది, దాని విశిష్ట గుర్తింపు సంఖ్య వంటి వివరాలు అవసరమవుతాయి.
సరకుల బట్వాడాకు ప్రత్యేక డ్రోన్‌ నడవాలను అభివృద్ధి చేస్తారు. దేశంలో డ్రోన్‌ అనుకూల నియంత్రణ వ్యవస్థను తెచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తారు. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని