Mumbai: రెండు టీకాలు పొందితే లోకల్‌ రైళ్లలో ప్రయాణానికి అనుమతి

రెండు డోసుల కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిని ముంబయిలో లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు

Published : 09 Aug 2021 14:22 IST

15 నుంచి ముంబయిలో అమలు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: రెండు డోసుల కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారిని ముంబయిలో లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే రెండో డోసు తీసుకుని 14 రోజులు పూర్తయివారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇంతవరకు ఈ రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌తో సోమవారం సమావేశం నిర్వహిస్తామని.. అనంతరం దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన ప్రార్థన మందిరాల్లో నిబంధనల సడలింపు విషయం ఆలోచిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంతవరకు ముంబయిలో 14 లక్షల మందికి పూర్తిస్థాయిలో టీకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి రాకుండా అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉందని.. తగిన జాగ్రత్తలు పాటించడంతోనే ఇది సాధ్యమని అన్నారు. ఎంతమంది పౌరులు పూర్తిస్థాయిలో టీకాలు పొందారు? వారికి ఎలాంటి సడలింపులు ఇవ్చొచ్చు? తదితర అంశాలపై మరో వారంలో నిర్ణయానికి వస్తామన్నారు. వీలయినంత మేర ఇంటి నుంచి పనిచేయించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని.. వీలుకాని వారు కార్యాలయాల్లో రద్దీ లేకుండా చూడాలన్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్నచోట నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పుణె, అహ్మద్‌నగర్, సోలాపుర్, కొల్హాపుర్, సంగ్లీ, సతారా, సింధుదుర్గ్, రత్నగిరి, బీద్‌ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. ఈ జిల్లాల్లో స్థానిక అధికారులపై కీలక బాధ్యతలున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని