Pichai: ఇంటర్నెట్‌పై పలు దేశాల్లో దాడి 

ఇంటర్నెట్‌ పలు దేశాల్లో దాడికి గురవుతోందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 13 Jul 2021 15:22 IST

బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఇంటర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురు నిలవాలి

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పిలుపు

లండన్‌: ఇంటర్నెట్‌ పలు దేశాల్లో దాడికి గురవుతోందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యానించారు. బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు.. అంతర్జాల విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను తీసుకొచ్చిన క్రమంలో- ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిబంధనలు ఇబ్బందికరంగా పరిణమించాయంటూ.. కొన్ని సామాజిక మాధ్యమాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. 

‘‘ప్రతి దేశంలో ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలను అనుమతించాలన్న దానిపై చర్చ జరుగుతోంది. సమాచార ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్నిచోట్ల ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైన ప్రజాస్వామ్య మూలాలు, విలువలు ఉన్న దేశాలు.. ఇంటర్నెట్‌ విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఉచిత, అనియంత్రిత అంతర్జాలం మంచిని ప్రోది చేసేందుకు తోడ్పడుతుంది. దీన్ని అడ్డుకోవడమంటే వెనక్కి వెళ్లడమే. నేను అమెరికా పౌరుణ్ని. కానీ, నాలో భారతీయ మూలాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయి. భారతీయ ఆత్మ నాలో ఉంది’’ అని సుందర్‌ పిచాయ్‌ అన్నారు.

పాతికేళ్లలో అవే కీలకం: చైనాలో గూగుల్‌కు సంబంధించిన ప్రధాన ఉత్పత్తులేవీ అందుబాటులో లేవని పిచాయ్‌ చెప్పారు. వచ్చే పాతికేళ్లలో కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో సాధించే ప్రగతి.. ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. మనిషి అభివృద్ధి చేసిన గొప్ప సాంకేతికతలుగా ఇవి నిలుస్తాయని చెప్పారు. కృత్రిమ మేధ అంటే.. మానవ మేధస్సును యంత్రాల్లోకి చొప్పించి, అనేక రెట్లు దాన్ని వృద్ధిచేసి, పనిచేయించడమేనన్నారు. కృత్రిమ మేధో వ్యవస్థలు మనుషుల కంటే మిన్నగా సమస్యలను పరిష్కరిస్తున్నాయన్నారు. నిప్పు, విద్యుత్తు, ఇంటర్నెట్‌ నేడు ఎంత అవసరమో.. భవిష్యత్తులో కృత్రిమమేధ అంతకు మించి అవసరమవుతుందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని