Published : 06/06/2021 14:24 IST

Earthquake: భూకంపాలను ముందే గుర్తించవచ్చా?

సాధ్యమేనంటున్న శాస్త్రవేత్తలు
కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో మరింత కచ్చితత్వం
‘ఈనాడు’తో ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు

భూకంపాలను ముందే గుర్తించవచ్చా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ)లోని భూకంపాల అధ్యయన కేంద్రం శాస్త్రవేత్తలు. భూమి లోపల నీటిమట్టంపై ఒత్తిడి, వాతారణంలోని ఐనోస్పియర్‌లో మార్పులు, భూకంపాలకు ముందు వచ్చే చిన్నచిన్న ప్రకంపనలు, భూమి పగుళ్లలోంచి వచ్చే రెడాన్‌ వాయువులను అధ్యయనం చేయడం ద్వారా భూకంపాలను ముందే గుర్తించవచ్చని  చెబుతున్నారు. అయితే ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నామని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని కంప్యూటరీకరించి కృత్రిమమేధ, మెషిన్‌లెర్నింగ్‌ సాంకేతికను జోడిస్తే కచ్చితత్వం వస్తుందని ఎన్‌జీఆర్‌ఐ భూకంప అధ్యయన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు అన్నారు. ఎన్‌జీఆర్‌ఐ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో చర్చలు, కార్యశాలలు జరుగుతున్నాయి. భూకంపాలపై జరిగిన సరికొత్త పరిశోధనలు, ప్రకంపనలను ముందే గుర్తించే విధానాలపై జరిగిన చర్చల సారాంశాన్ని ఆయన ‘ఈనాడు’కు వివరించారు.

నీటిమట్టంలో తేడాలు ఇలా

భూకంపం రావడానికి ముందు భూమి లోపలి పొరల్లోని నీటిమట్టంలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రకంపనాల తాకిడికి నీటి వనరులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ ప్రాంతంలో బోర్లు ఉన్న పక్షంలో అందులోంచి ఒక్కసారిగా నీరు పైకి ఉబికి వస్తుంది. భూమిలోపల ఏదో జరుగుతుందనేందుకు ఇదో సంకేతం. ఈ తరహా అధ్యయనాన్ని ఎన్‌జీఆర్‌ఐ మహారాష్ట్రలోని కోయ్నా ప్రాంతంలో చేపట్టింది. అక్కడికి 20 కి.మీ. పరిధిలో ఉన్న బోర్‌వెల్స్‌కు పరికరాలు అమర్చి శాటిలైట్, ఇంటర్నెట్‌ సాయంతో పర్యవేక్షించింది. బోర్ల నుంచి ఉబికి వచ్చిన నీరు ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని ముందే హెచ్చరించింది. ఆ తర్వాత అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయి. 

రెడాన్‌ గ్యాస్‌వాయువులు.. 

భూకంపాలకు ముందు భూమి లోపల ఏర్పడే ఒత్తిడికి పగుళ్లు ఏర్పడుతాయి. ఇందులోంచి రెడాన్‌ వాయువులు బయటికి వస్తాయి. వాటిని గుర్తించే పరికరాలను ఎన్‌జీఆర్‌ఐ వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసి నమోదు చేస్తుంది. వీటిని విశ్లేషించడం ద్వారా భూకంపం ముందే వచ్చే అవకాశాలను అంచనా వేస్తుంది.

ఐనోస్పియర్‌లో ఛార్జ్‌లో తేడాలు..

వాతావరణంలో ఉండే పొరల్లో మార్పుల్ని గమనించడం ద్వారా కూడా భూకంపాలను అంచనా వేయవచ్చు. ఐనోస్పియర్‌లో విద్యుదయస్కాంత తరంగ శక్తి ఉంటుంది. ప్రకంపనలు సంభవించినప్పుడు తరంగాల శక్తిలో మార్పులు సంభవిస్తాయి. భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఈ తేడాలను గతంలో ఎన్‌జీఆర్‌ఐ రికార్డు చేసింది. ఈ మార్పులను గుర్తించేలోపే భూకంపాలు వచ్చేస్తుండటంతో ఇది పెద్దగా ప్రయోజనం ఇవ్వడం లేదు. అప్రమత్తం చేసేందుకు గంట కూడా సమయం ఉండడం లేదు. అందుకే దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాం. 

చిన్న ప్రకంపనలతో మొదలై.. 

భూకంపాలు ఏర్పడటానికి ముందు భూమిలో చిన్నచిన్న ప్రకంపనలు ఏర్పడతాయి. వీటినే ఫోర్‌షాక్స్‌ క్లస్టర్స్‌ అంటారు. గుంపుగా, తక్కువ సమయంలో అవి వచ్చిపోతుంటాయి. వీటిని పర్యవేక్షించడం ద్వారా భారీ భూకంపాలను ముందే పసిగట్టవచ్చు. 

కృత్రిమ మేధ తోడైతే

భూకంపాల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. వీటిని కంప్యూటరీకరించి కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ సాయంతో పర్యవేక్షణకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి భూకంప లేఖినులు, ఇతరత్రా పరికరాల అమర్చగలిగితే కచ్చితమైన సమాచారం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ విధానంలో ఆరంభ దశలో ఉన్నాం. మరింత పరిశోధనలు జరగాల్సి ఉంది. 

లాక్‌డౌన్‌తో అధ్యయనానికి అనువుగా.. 

భూకంపాల అధ్యయనానికి లాక్‌డౌన్‌ కాలం బాగా ఉపయోగపడింది. సాధారణ రోజుల్లో ట్రాఫిక్, పరిశ్రమల శబ్దాలతో భూకంప లేఖినిలో సంకేతాలను వేరు చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చేది. శబ్దాన్ని వడగట్టేందుకు వాడే ఫిల్టర్ల విశ్లేషణలోనూ కొన్నిసార్లు స్పష్టత ఉండేది కాదు. లాక్‌డౌన్‌తో శబ్దాలు స్పష్టంగా నమోదవుతున్నారు.-ఈనాడు, హైదరాబాద్‌-

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్