అమెరికా: వ్యాక్సిన్ కోసం మ‌రో రూ.11వేల కోట్లు!

మాన‌వాళిని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా శాస్త్రవేత్త‌లు కృషి చేస్తూనే ఉన్నారు. ..

Published : 08 Jul 2020 14:36 IST

భారీ నిధితో నోవావాక్స్‌తో ఒప్పందం

వాషింగ్ట‌న్: మాన‌వాళిని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా శాస్త్రవేత్త‌లు కృషి చేస్తూనే ఉన్నారు. దీనిలో భాగాంగా వివిధ దేశాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆయా కంపెనీల‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డంతోపాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ కోసం 1.2బిలియ‌న్ డాల‌ర్లను అందించిన‌ అమెరికా, మ‌రో కంపెనీకి భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. నోవావాక్స్ త‌యారు చేస్తోన్న క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధి, కోసం 1.6బిలియ‌న్ డాల‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా కొవిడ్-19 చికిత్స కోసం కృషిచేస్తోన్న రెజెనెరాన్ ఫార్మాకు మ‌రో 450మిలియ‌న్ డాల‌ర్ల‌ను మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఈ సంవత్స‌రం చివ‌రి నాటికి 10కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందించేందుకు అమెరికా ఆరోగ్య‌, మాన‌వ సేవ‌ల విభాగం(హెచ్‌హెచ్ఎస్‌), ర‌క్ష‌ణ‌శాఖ‌తో నోవావాక్స్‌ ఒప్పందం కుద‌రుర్చుకుంది.

అమెరికాతో పాటు ప్రపంచ‌వ్యాప్తంగా ఏర్ప‌డ్డ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని అధిగ‌మించ‌డంలో భాగంగా శర వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధికోసం కృషిచేస్తున్న‌ట్లు నోవావాక్స్ వెల్ల‌డించింది. నోవావాక్స్ తయారుచేసిన NVX-CoV2373 మూడోద‌శ ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మైంది. కీట‌కాల క‌ణాల‌ను ఉప‌యోగించి చేసిన ఈ వ్యాక్సిన్, మాన‌వ శ‌రీరంలో రోగ‌నిరోధ‌కశ‌క్తి గ‌ణ‌నీయంగా పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

అయితే, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోసం ఇప్ప‌టికే అమెరికా 1.2బిలియ‌న్ డాల‌ర్లను అందించిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా దాదాపు 40కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందించేందుకు ఆస్ట్రాజెనికా అంగీక‌రించింది.

ఇవీ చ‌దవండి..
గాలి ద్వారా క‌రోనా..కొట్టిపారేయ‌లేం..: WHO
2021 నాటికి 25కోట్ల మందికి క‌రోనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని