హాంగ్‌కాంగ్‌పై చైనా ఉక్కుపంజరం..! 

హాంగ్‌కాంగ్‌ను రెక్కలు విరిచి ఉక్కు పంజరంలోకి నెట్టింది చైనా.  బ్రిటిష్‌ -సైనో ఒప్పందానికి తూట్లుపొడిచింది. ఉద్యమం చేసే.. ‘విదేశీ శక్తి’ పేరుతో కటకటాల్లోకి పంపించే యాంటీప్రొటెస్ట్‌ లా

Published : 01 Jul 2020 15:59 IST

 ఆక్రమణ మొదలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

హాంగ్‌కాంగ్‌ను రెక్కలు విరిచి ఉక్కు పంజరంలోకి నెట్టింది చైనా.  బ్రిటిష్‌ -సైనో ఒప్పందానికి తూట్లుపొడిచింది. ఉద్యమం చేసే.. ‘విదేశీ శక్తి’ పేరుతో కటకటాల్లోకి పంపించే జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో 23 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం అనుభవిస్తున్న హాంగ్‌కాంగ్‌ మెల్లగా చైనా కమ్యూనిస్టు పార్టీ గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఈ కొత్త చట్టం ప్రకారం వేర్పాటు వాదం, ఉగ్రవాదానికి జీవితం కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  

చైనా తీసుకొన్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో మాట్లాడుతూ 50 ఏళ్లు ప్రజాస్వామ్యానికి వాగ్దానం చేసి కేవలం 23ఏళ్లలోనే దానిని హరించారని విమర్శించారు. 

మరోపక్క హాంగ్‌కాంగ్‌లోని చైనా మద్దతుదారు అయిన చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ కెరీ లామ్‌ మాత్రం ఈ చట్టం వల్ల నగరంలో శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరతాయని వ్యాఖ్యానించడం గమనార్హం.  చైనా-హాంగ్‌కాంగ్‌ సంబంధాలు కీలక దశకు చేరుకొన్నాయని పేర్కొన్నారు.  మరోపక్క చైనా అధికారులు విదేశీ స్పందనలపై మాత్రం విరుచుకుపడ్డారు. ‘దీంతో మీకేంటి సంబంధం’అని ప్రశ్నించారు. హాంగ్‌కాంగ్‌ అండ్‌ మకావ్‌ ఆఫీస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఝాంగ్‌ జియామింగ్‌ మాట్లాడుతూ  చైనీయులు ఎవరికీ భయపడరని వ్యాఖ్యానించారు. 

2019 జూన్‌ 9న వివాదానికి బీజం వేస్తూ హాంకాంగ్‌ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. మూడు రోజుల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. అవి సునామీలా మారాయి.  సాక్షాత్తు హాంకాంగ్‌ పాలకురాలు, చైనా కీలుబొమ్మగా పేరున్న కెరీలామ్‌ ‘సారీ’ చెప్పినా.. ఏడ్చినా.. బిల్లును రద్దు చేసినా ఆందోళనలు 2019 చివరి వరకు కొనసాగాయి.   చైనా  నేరుగా రంగంలోకి దిగింది. భద్రతా దళాలు మారుదుస్తుల్లో హాంకాంగ్‌ ప్రదర్శనకారుల్లో చేరి దాడులు చేశాయి.  భారీగా చైనా దళాలు, ట్యాంకులను మోహరించింది. అప్పట్లో వ్యవహారం మొత్తం చూస్తే  చైనా దండయాత్ర చేస్తోందా.. లేక మరో తియాన్మన్‌ స్క్వేర్‌ పునరావృతం అవుతుందా అనే స్థాయిలో పరిస్థితి నెలకొంది. కానీ, 2020 ప్రారంభంలో కరోనావైరస్‌ వ్యాపించింది. దీంతో ఉద్యమానికి కొన్నాళ్లు విరామం లభించింది. ఈ అదునుగా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. కానీ, వందల సంఖ్యలో విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు.  ఈ జాతీయ భద్రతా చట్టానికి నిన్న హాంగ్‌కాంగ్‌ చట్టసభ ఆమోదముద్రవేసింది. 

హాంగ్‌కాంగ్‌లో చైనా సెక్యూరిటీ ఆఫీస్‌
జాతీయ భద్రతా చట్టానికి ఆమోదముద్ర పడగానే.. చైనా సెక్యూరిటీ కార్యాలయాన్ని హాంగ్‌కాంగ్‌లో తెరిచింది. దీనిలో సొంత సిబ్బందిని ఏర్పాటు చేసింది. వీరిలో స్థానికులు ఎవరూ లేరు.  కొత్త చట్టం ప్రకారం చైనా, హాంగ్‌కాంగ్‌ ప్రభుత్వాలను వ్యతిరేకించడం ఆర్టికల్‌ 29 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా నేడు ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొత్త చట్టం కింద తొలి అరెస్టు జరిగింది. ఓ వ్యక్తి నల్లజెండా చేతపట్టుకొని స్వతంత్ర హాంగ్‌కాంగ్‌ నినాదాలు చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని