భారత సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం దక్కింది.......

Updated : 26 May 2020 11:09 IST

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్‌లోని ‘ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ రీసెర్చ్‌ సెంటర్‌’లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పేరు మీద 250 పేటెంట్లు ఉన్నాయి.

ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన జోషి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)నుంచి ఎం.ఎస్‌ పట్టా పొందారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రాసెసర్లు, సూపర్‌కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌, అత్యాధునిక గ్యాడ్జెట్లలో వాడే అనేక పరికరాలను ఆవిష్కరించారు. ఈయన ఆవిష్కరణలు కృత్రిమ మేధ, హెల్త్‌కేర్‌ రంగాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిని గుర్తించిన ‘న్యూయార్క్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా అసోసియేషన్‌’ ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.  

అవసరం, ఆతృతే తనను ఈ దిశగా నడిపించాయని అవార్డు స్వీకరించిన తర్వాత జోషి అన్నారు. సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించాలనే తపనే తనని ముందుకు నడిపిస్తోందన్నారు. చిన్నతనంలో అమ్మానాన్నలు చెప్పిన గొప్ప ఆవిష్కర్తలు మార్కోనీ, మేడం క్యూరీ, రైట్‌ బ్రదర్స్‌, జేమ్స్‌ వాట్‌ సహా మరికొంత మంది జీవిత విశేషాలు తనలో స్ఫూర్తినింపాయన్నారు. వారి విజయాలు, శ్రమ, దృక్పథం తన ఆలోచనా ధోరణిని మలిచాయన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, క్లౌడ్‌ సాంకేతికత వినియోగం విస్తృతం కానుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని