బ్రెజిల్‌లో ఒక్కరోజే 13,944 కొత్త కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 13,944 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం...

Updated : 15 May 2020 11:34 IST

24 గంటల్లో 844 మంది మృతి

బ్రెసిలియా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 13,944 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,02,918కి చేరింది. ఇప్పటివరకు ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అదే సమయంలో దేశవ్యాప్తంగా 844 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 13,993కి పెరిగింది. ఇక అంతకుముందు రోజు 11,385 కేసులు నమోదవ్వగా, 749 మంది కన్నుమూశారు.  బ్రెజిల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ వేల సంఖ్యలో పెరుగుతున్నా, ఆ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి నుంచి ఆయన లాక్‌డౌన్‌పై విముఖుత చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని సావోపాలో గవర్నర్‌ జావో డోరియా సమర్థించలేదు. మే 31 వరకు ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసర విభాగాలు తప్ప మిగిలిన రంగాలు ముసివేయాలని చెప్పారు. మరోవైపు అమెరికా, బ్రిటన్‌లోనూ కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 14.5 లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య 86 వేలు దాటింది. ఇక ఇంగ్లాండ్‌.. ఐరోపాలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. ఇక్కడ మొత్తం బాధితుల సంఖ్య 2.33 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 33 వేలకు పైగా నమోదైంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది బాధితులు కాగా.. 3 లక్షల మందికిపైగా బలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని