Published : 14/05/2020 01:14 IST

తొందరపడితే కరోనా మింగేస్తుంది.. జాగ్రత్త!

కరోనాపై సూపర్‌ పవర్‌ దేశాల్ని హెచ్చరిస్తున్న నిపుణులు
పాక్షిక సడలింపులతో పలుచోట్ల పెరుగుతున్న కేసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: కరోనా వైరస్‌ విసిరిన పంజాకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పేద, ధనిక  దేశాలనే తేడాలేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలయ్యాయి. ప్రపంచ సూపర్‌ పవర్‌ దేశాలుగా పేరెన్నిక గన్న దేశాల్నీ ఈ మహమ్మారి మరింతగా కుదిపేస్తోంది. తీవ్ర సంక్షోభంలోకి జారిన తమ ఆర్థిక వ్యవస్థలు త్వరగా కోలుకొనేందుకు సడలింపులు ఇవ్వాలని సూపర్‌ పవర్‌ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయా దేశాధినేతలకు ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. సరైన మార్గదర్శకాలను అనుసరిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విశ్వ మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి రాకుండా హడావుడిగా ఆర్థిక వ్యవస్థలను తెరవడం వల్ల మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.  

హడావుడితో తీరని నష్టమే..
కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉన్నాయని అమెరికాకు చెందిన అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌచీ  అన్నారు. ఒకవేళ అమెరికాలోని నగరాల్లో  ఆర్థిక వ్యవస్థను హడావుడిగా తెరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికే 80వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ సరైన మార్గదర్శకాలను అనుసరించకుండా ఆర్థిక వ్యవస్థలను తెరిస్తే.. ఈ వైరస్‌ మరింతగా విజృంభించి చేటు తెస్తుందని ఫౌచీ ఆందోళన వ్యక్తంచేశారు. 

ప్రముఖులకు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపులు
రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే, పెస్కోవ్‌ ఆస్పత్రి పాలైన మరుసటి రోజే (సోమవారం) దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలిస్తున్నట్టు పుతిన్‌ ప్రకటించడం గమనార్హం. అలాగే, గత నెలలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరి కోలుకోవడం ఈ వైరస్‌ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో నొక్కి చెబుతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4.2మిలియన్ల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 2.87 లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో అయితే  2.32లక్షల కేసులు నమోదు కాగా.. 2100 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాంటాక్ట్ ట్రేసింగ్‌లో ఆ దేశాలు భేష్‌!
జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు కాంటాక్ట్ ట్రేసింగ్‌లో బాగా చేశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీస్‌ చీఫ్‌ డాక్టర్‌ మైఖేల్‌ రియాన్‌ తెలిపారు. కరోనా బాధితులను గుర్తించి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశాయని ప్రశంసించారు. అందుకే అక్కడ కరోనా నియంత్రణలో ఉందన్నారు. కానీ ఇతర దేశాలు మాత్రం కరోనా రోగులను కలిసిన ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడం, వారిని ట్రేస్‌ చేసి క్వారంటైన్‌కు తరలించడంలో అంత సమర్థంగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘మాంసం ప్యాకింగ్‌’ పరిశ్రమలో కరోనా విజృంభణ  
మరోవైపు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు స్టే ఎట్‌ హోం నిబంధనల్ని నీరుగారుస్తూ తమ కార్యకలాపాలను ముందుకు కొనసాగించడం ప్రారంభించాయనీ.. దీంతో ఆఫీసులకు వెళ్లిన వేలాది మంది ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విశ్లేషణలో వెల్లడైంది. అలాగే, మాంసం ప్యాకింగ్‌, పౌల్ట్రీ ప్రాసిసింగ్‌ ప్లాంట్‌ల వద్ద ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌, ఆస్టిన్‌లలో నిర్మాణరంగ కార్మికుల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని 15 కౌంటీలలో ఏప్రిల్‌ 28 నుంచి మే 5 మధ్య పెద్ద మొత్తంలో నమోదైన కేసుల్లో మాంసం ప్యాకింగ్‌, పౌల్ట్రీ ప్రాసిసింగ్‌ ప్లాంట్‌లు/ కారాగారాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాకాంల్లో వెల్లడించింది.

24గంటల్లో 200మంది నర్సులకు.. 
అమెరికాలో వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. కరోనా రోగులకు అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాలిఫోర్నియాలో ఒక్క రోజులోనే 200 మంది నర్సులకు కరోనా సోకినట్టు  నర్సింగ్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ గెరార్డ్‌ బోర్డాన్‌ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 28వేల మంది నర్సులు కరోనా బారిన పడగా.. వారిలో 230మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. అమెరికాలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నిబంధనల్ని సడలిస్తే పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటలీలో సడలింపుల తర్వాత పెరుగుతున్న కేసులు!
ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. కొన్నాళ్ల పాటు అక్కడ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ నిబంధనల్ని కాస్త సడలించాక అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్టు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి నిన్నటి వరకు లాంబార్డీ ప్రాంతంలోనే 1033 కొత్త కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇటలీలో ఇప్పటివరకు 2.21లక్షలకు పైగా కేసులు నమోదు కాగా మరణాలు 30,911కి చేరాయి. ఇక్కడ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

24గంటల్లో అక్కడ 172 మరణాలు నమోదు కావడం గమనార్హం. ఇటలీలోని మొత్తం కరోనా మరణాల్లో దాదాపు సగం మృతులు లాంబార్డీలోనే కావడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. మే4న అక్కడ లాక్‌డౌన్‌ పరిమితుల్ని పాక్షికంగా ఎత్తివేసిన ఈ కేసులు పెరుగుతుండటంపై  మే 4న లాక్‌డౌన్‌ పరిమితుల్ని పాక్షికంగా ఎత్తివేసిన తర్వాత ఈ వైరస్‌ వ్యాప్తి రేటు ఎలా ఉంది? రోజూ ఎన్నికేసులు నమోదవుతున్నాయి? అనే అంశంపై అక్కడి వైద్య అధికారులు అధ్యయనం చేస్తున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని