లాక్‌డౌన్‌ మంచిదే: ప్రభుత్వానికే మా మద్దతు 

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ విధానం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 82 శాతం మంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, 86 శాతం మంది తమ భవిష్యత్తు... 

Published : 17 Apr 2020 01:21 IST

ముంబయి: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ విధానం పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు 82 శాతం మంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, 86 శాతం మంది తమ భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఉన్నారట. ఈ మేరకు లండన్‌ కేంద్రంగా పనిచేసే సీటీ (క్రాస్‌బై టెక్స్‌టర్‌) గ్రూప్‌ అనే సంస్థ ‘సీటీ గ్లోబల్ లీడర్‌షిప్‌ ఇన్‌సైట్స్ ట్రాకర్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌, బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్ దేశాల్లో రెండు దశల్లో (మార్చి 23, 26 - ఏప్రిల్ 2 నుంచి 5 మధ్య) ఆన్‌లైన్ సర్వే నిర్వహించి తాజాగా వాటి ఫలితాలను వెల్లడించింది.

మొదటి దశ సర్వేలో భారత్‌లో 82 శాతం మంది కరోనా కట్టడికి కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు తమ మద్దతును తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి కరోనా కేసుల నమోదును, మరణాల సంఖ్యను తగ్గించడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని 85 శాతం మంది అభిప్రాయపడ్డట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదే సమయంలో బ్రిటన్‌ - 60 శాతం, అమెరికా - 44, ఆస్ట్రేలియా - 67, హాంకాంగ్ - 45 శాతం మంది కరోనా నియంత్రణకు తమ దేశం అనుసరిస్తున్న విధానాలకు మద్దతు తెలిపారట. అలానే మరణాల తగ్గింపు విషయంలో ఆయా దేశాల నిర్ణయాలపట్ల బ్రిటన్‌ - 53 శాతం, అమెరికా - 51, ఆస్ట్రేలియా - 64, హాంకాంగ్ - 65 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారట.

ఇక రెండో దశ సర్వేలో 86 శాతం మంది భారతీయుల తమ భవిష్యత్తుపట్ల ఆందోళన వ్యక్తం చేసినట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. హాంకాంగ్ - 71 శాతం, అమెరికా - 51, ఆస్ట్రేలియా - 39, బ్రిటన్‌ - 38 శాతం మంది భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. అలానే సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఒకటి, రెండు నెలల్లో సాదారణ పరిస్థితుల నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అమెరికా, హాంకాంగ్‌లలో ఇందుకు 2 నుంచి 4 నెలలు సమయం పడుతుందనే ఆలోచనలో ఉన్నారట. ఇక బ్రిటన్‌, ఆస్ట్రేలియాలో 6 నుంచి 12 నెలలు పట్ట వచ్చన్న అంచనాలో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కార్పొరేట్‌ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు వ్యవహరిస్తున్న తీరును భారత్‌లో 77 శాతం మంది సమర్థించారు. అలానే బ్రిటన్‌ - 49 శాతం, అమెరికా - 46, ఆస్ట్రేలియా - 54, హాంకాంగ్ - 56 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు. అదేవిధంగా కరోనాపై పోరుకు తాము ఉద్యోగం చేస్తున్న సంస్థలు వ్యవహరిస్తున్న విధానాల పట్ల భారత్‌లో ప్రతి ఐదుగురిలో నలుగురు సంతృప్తి వ్యక్తం చేయగా, అమెరికా - 47 శాతం, బ్రిటన్‌ - 49 శాతం, ఆస్ట్రేలియా - 54 శాతం, హాంకాంగ్ - 54 శాతం) మంది మాత్రమే తమ మద్దతు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని