దేశంలో 324కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం నాటికి దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 315కు చేరింది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated : 22 Mar 2020 11:56 IST

దిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం నాటికి దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 324కు చేరింది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ విస్తరించినట్లు భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దీని బారిన పడి ఇప్పటికే దిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో మొత్తం ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.  ఇంకా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్రం వెల్లడించాల్సి ఉంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో పలు ఆంక్షలు విధించాయి. దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 25కు చేరింది. ఆంక్షల ప్రభావం కారణంగా పేదవారు ఒత్తిళ్లకు గురికాకుండా వచ్చే నెల చౌకధరల దుకాణాల్లో సరుకులు 50శాతం అధికంగా పొందవచ్చని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 63 కేసులు నమోదు కాగా, కేరళ 45 కేసులతో రెండో స్థానంలో ఉంది. పుణెకు చెందిన ఓ మహిళ విదేశాలకు వెళ్లకున్నా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడం శనివారం చర్చనీయాంశంగా మారింది. యూపీలో 23 కేసులు నమోదు కావడంతో.. ఆంక్షల కారణంగా ప్రభావితమవుతున్న దినసరి కూలీలకు యోగి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర లేబర్‌ విభాగం కింద రిజిస్టర్‌ అయిన 35 లక్షల మందికి అవసరాల నిమిత్తం రూ.1000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో అంతర్గతంగా 10.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి 11.. మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మూడు కేసులు నమోదయ్యాయి.

జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో శ్రీనగర్‌, గాందర్బల్‌ జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఇచ్చిన సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. వారంతా విధులకు వచ్చి కరోనా వ్యాప్తి నియంత్రణ పనుల్లో పాల్గొనాలని సూచించింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి సారిగా నిన్న అసోంలో ఓ నాలుగేళ్ల బాలికకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ బాలికను జోర్హత్‌ వైద్య కళాశాలకు తరలించి పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వశర్మ తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం 24 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజలందర్నీ ఈ రోజు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు.

ఇటలీ నుంచి బయలు దేరిన విద్యార్థులు
ఇటలీ ఉన్న 263 మంది భారతీయ విద్యార్థులను రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌ఇండియా ప్రత్యేక విమానంలో వారిని భారత్‌కు తీసుకువస్తున్నట్లు ఇటలీలో భారతీయ కార్యాలయం వెల్లడించింది. వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు నిబద్ధతతో ఉన్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు