దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీవాస్తవ

దిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తను నియమిస్తున్నట్లు హోంశాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అమూల్య పట్నాయక్‌ రేపు పదవీవిరమణ పొందనున్నారు.........

Updated : 23 Aug 2022 12:11 IST

దిల్లీ: దిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు హోంశాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అమూల్య పట్నాయక్‌ రేపు పదవీవిరమణ పొందనున్నారు. ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని నెలరోజుల పాటు పొడగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన స్థానంలో రేపు శ్రీవాస్తవ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. ఈశాన్య దిల్లీలో జరిగిన ఘటనల్ని అదుపు చేయడంలో పోలీసులు విఫలమైనట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. దిల్లీ పోలీసుల ప్రతిష్ఠ సంక్షోభంలో పడిందని అభిప్రాయపడ్డారు. దిల్లీ పోలీసు కమిషనర్‌పై సైతం విమర్శలు వస్తున్నాయన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలో దిల్లీకి కొత్త కమిషనర్‌ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీవాస్తవ బాధ్యతలు చేపట్టనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో శ్రీవాస్తవ సెంట్రల్‌ దిల్లీలో డిప్యూటీ కమిషనర్‌ హోదాలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. సీఏఏపై ఆందోళనలను అదుపు చేసే నేపథ్యంలో ఇటీవల ఆయన్ని దిల్లీ శాంతి, భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. అంతకుముందు ఆయన సీఆర్‌పీఎఫ్‌ విభాగంలో పనిచేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని