హిందువు పెళ్లికి ముస్లింల రక్షణ! 

ముస్లింల ప్రాభల్యం అధికంగా ఉండే ఆ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబం నివసిస్తోంది.  తాజాగా ఆ కుటుంబంలోని అమ్మాయికి వివాహం నిశ్చయమయ్యింది. ...

Published : 28 Feb 2020 15:11 IST

దిల్లీ: ముస్లింలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబం నివసిస్తోంది. తాజాగా ఆ కుటుంబంలోని అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముహూర్తం దగ్గరపడుతోంది. పెళ్లి పనులతో సందడిగా మారిన వేళ.. ఆ ప్రాంతంలో అనుకోకుండా ఘర్షణలు మొదలయ్యాయి. అయితే ఇరుగు పొరుగున ఉండే ముస్లిం కుటుంబాలే వారికి అండగా నిలిచాయి. పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని వారే ఆ కుటుంబానికి రక్షణగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించిన ఘటన ఈశాన్య దిల్లీలో చోటుచేసుకుంది. 

దిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఉంటున్న 23ఏళ్ల యువతి సావిత్రి వివాహం గత మంగళవారం జరిగింది. అయితే పెళ్లికి ముందురోజు వేడుకల సమయంలోనే ఆ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పెళ్లికి రావాల్సిన బంధువులు కూడా హాజరుకాలేదు. దీంతో వివాహం ఆగిపోతుందన్న భయంతో పెళ్లికూతురు కన్నీరుమున్నీరైంది. అలా ఏడుస్తూ కూర్చున్న కూతురిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ సమయంలో ఇరుగుపొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలు అండగా నిలిచాయి. స్థానిక ముస్లిం కుటుంబాలన్నీ పెళ్లికి హాజరయ్యాయి. ఆ ఇంటిబయట కొందరు యువకులు రక్షణగా నిలవగా.. ఇంటి ఆవరణలోనే వివాహానికి ఏర్పాట్లు చేశారు. పొరుగున ఉన్న ముస్లింలే పెళ్లి పెద్దలుగా వివాహాన్ని జరిపించి నవదంపతులను ఆశీర్వదించారు. దీంతో అనుకున్న సమయానికి వివాహం జరగడంతో  ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

‘హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా ఎన్నో సంవత్సరాలుగా సోదరభావంతో ఇక్కడ నివసిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో మా కళ్ల ముందే అమ్మాయి పెళ్లి ఆగిపోతుండటం తట్టుకోలేకపోయాం. అందుకే దగ్గరుండి పెళ్లి జరిపించాం’ అని సమీనా బేగం అనే స్థానిక మహిళ తెలిపింది. ఈ వివాహానికి మా బంధువులెవరూ హాజరుకాలేకపోయినప్పటికీ ముస్లిం సోదరుల సహకారంతో ఈ పెళ్లి జరగడం సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి బోడే ప్రసాద్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని