మరో నలుగురు భారతీయులకు కరోనా..!

జపాన్‌లోని యొకొహామాలో నిలిపి ఉంచిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కరోనా (కోవిడ్‌-19) మరింత మందికి వ్యాపిస్తోంది. తాజా మరో నలుగురు భారతీయులు ఈ వైరస్‌ బారిన పడినట్లు తేలింది.

Updated : 23 Feb 2020 14:54 IST

 డైమండ్‌ ప్రిన్సెస్‌లో పెరిగిన బాధితులు

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌లోని యొకొహామాలో నిలిపి ఉంచిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కరోనా (కోవిడ్‌-19) మరింత మందికి వ్యాపిస్తోంది. తాజాగా మరో నలుగురు భారతీయులు ఈ వైరస్‌ బారిన పడినట్లు తేలింది. మొత్తం 3,711 మంది ఉన్న ఈ నౌకలో 138 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 132 మంది ఆ నౌకలో పని చేస్తుండగా.. మరో ఆరుగురు ప్రయాణికులు. ఈ నౌకలో తాజాగా మరో నలుగురు భారతీయులకు కరోనా సోకిందని భారత దౌత్యకార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఓడలో వైరస్‌ సోకిన భారతీయుల సంఖ్య 12కు పెరిగినట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. వీరందరికి చికిత్సను అందిస్తున్నట్లు పేర్కొంది. 
 
గత వారంతో రెండు వారాల వైద్య పర్యవేక్షణ గడువు ముగియడంతో ఆరోగ్యవంతులను నౌక నుంచి దింపేస్తున్నారు. దీంతో ఇంకా నౌకలో 1,000  మంది మిగిలినట్లు జపాన్‌ చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీ యోషిహిడే సుగా వెల్లడించారు. 

 ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయులు సహా ఇతర ప్రయాణికులకు జపాన్ అధికారులు మరోసారి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార అధికార కార్యాలయం నిన్న ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘ప్రస్తుతం నౌకలో ఉన్న భారతీయులకు జపాన్‌ అధికారులు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏ ఒక్కరూ కొవిడ్ లక్షణాలతో ఉండకూడదని ఆశిస్తున్నాం ’ అని పేర్కొంది. 

నేపాల్‌ మీడియాకు చైనా బెదిరింపులు..

కరోనాపై నిజాలు తొక్కిపెడుతోందంటూ చైనాపై వచ్చే విమర్శలకు బలం చేకూరేలా ఇటీవల కొన్ని ఘటనలు  జరిగాయి. నేపాల్‌ మీడియాను బెదిరించేందుకు చైనా చేసిన ప్రయత్నం బెడిసికొంట్టింది. చైనాలో కరోనాకు సంబంధించి చాలా సమాచారాన్ని దాచిపెడుతున్నారని.. అందుకే వేగంగా వ్యాపిస్తోందని ‘కాఠ్‌మండూ పోస్టు’ పత్రిక సిండికేటెడ్‌ కాలమ్‌ను ప్రచురించింది. దీనిపై చైనా దౌత్యకార్యలయం అగ్గిమీద గుగ్గిలమైంది. ఆ సంస్థ ఎడిటర్‌పై, ఉద్యోగిపై అనుచితమైన భాషను ఉపయోగించింది. దాని ఎడిటర్‌ అనూప్‌ కప్లి చైనా వ్యతిరేక శక్తుల పెంపుడు చిలక అని పేర్కొంది.

దీంతో ఆగ్రహించిన నేపాల్‌ మీడియా చైనా తీరుపై విరుచుకుపడింది. నేపాల్‌ ప్రజల పత్రికా స్వేచ్ఛపై బెదిరింపులుగా అభివర్ణించింది. ఎనిమిది పత్రికలకు చెందిన ఎడిటర్లు కలిసి బుధవారం ఒక ప్రకటన చేశారు. నేపాల్‌ రాజ్యాంగం పత్రికాస్వేచ్ఛకు హామీగా ఉంది.. మేము దానిని రక్షించుకొంటాము అని  ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని