2,300 దాటిన కరోనా మృతులు 

చైనాలో కొవిడ్‌-19(కరోనా వైరస్‌) మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో 109 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 2,345కు చేరింది

Updated : 22 Feb 2020 11:30 IST

వుహాన్‌కు డబ్ల్యూహెచ్‌వో బృందం

బీజింగ్‌: చైనాలో కొవిడ్‌-19(కరోనా వైరస్‌) మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో 109 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 2,345కు చేరింది. ఇక నిన్న కొత్తగా మరో 397 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 76,288కి పెరిగినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ రోజువారీ నివేదికలో వెల్లడించింది. ఇక శుక్రవారం మరణించిన వారిలో ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌ నుంచే అత్యధికంగా 106 మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో కొత్తగా 366 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. 

వుహాన్‌కు డబ్ల్యూహెచ్‌వో

మరోవైపు కొవిడ్‌-19పై దర్యాప్తు చేసేందుకు చైనాలో ఉన్న డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం శనివారం వుహాన్‌ వెళ్లనుంది. మొత్తం 12 మంది నిపుణుల బృందం గత సోమవారం చైనా చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వీరు బీజింగ్‌, గాంగ్‌డాంగ్‌, సిచువాన్‌ ప్రావిన్స్‌లలో పర్యటించారు. తాజాగా వైరస్‌ పుట్టుకొచ్చిన వుహాన్‌ నగరం, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్స్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించనట్లు డబ్ల్యూహెచ్‌వో వర్గాలు వెల్లడించాయి. 

ఇటలీలో తొలి మరణం..

మరోవైపు కరోనా వైరస్‌ ఇటలీకి కూడా పాకింది. ఈ వైరస్‌ కారణంగా 78ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ఇటలీ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి గత 10 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

అమెరికాలో 35 కేసులు..

అగ్రరాజ్యంలో కొవిడ్‌ వైరస్‌ సోకిన వారి సంఖ్య 35కు చేరింది. ఇటీవల జపాన్‌లోని డైమండ్‌ ప్రిన్సెన్స్‌ నౌక నుంచి దాదాపు 300 మందికి పైగా అమెరికన్లను ఆ దేశం స్వదేశానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అందులో కొందరికి తాజాగా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అటు యూకే కూడా జపాన్‌ నౌకలోని తమ దేశస్థులను స్వదేశానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. దక్షిణ కొరియాలో శనివారం మరో 142 మందిలో కరోనా జాడను గుర్తించారు. దీంతో ఆ దేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 346కు పెరిగింది. 

బిల్‌గేట్స్‌కు కృతజ్ఞతలు

కరోనాను ఎదుర్కోవడంలో చైనాకు ఆర్థిక సాయం అందించిన ప్రముఖ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. వైరస్‌పై పోరాడేందుకు గేట్స్‌కు చెందిన ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌’ ఫౌండేషన్‌ 100మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు