ఆ తీర్పుతో మరింత క్లారిటీ వచ్చింది:ఆర్మీచీఫ్‌ 

సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’ను ఇచ్చేలా మార్గం సుగమమం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును  సైన్యాధిపతి నరవాణే స్వాగతించారు. పార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మహిళా.......

Updated : 20 Feb 2020 21:24 IST

సైన్యంలో ఎవరిపట్లా వివక్ష ఉండదన్న నరవణె

దిల్లీ: సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’ను ఇచ్చేలా మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత సైన్యాధిపతి నరవాణే స్వాగతించారు. పార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సైన్యం మరింత బలోపేతమవుతుందన్నారు. లింగ సమానత్వం పాటించే విషయంలో సైన్యం ఇప్పటికే ముందుందన్న ఆయన.. తాజాగా  తీర్పుతో ఈ విషయంలో ముందుకెళ్లేందుకు తమకు మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం పనిచేయడమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. సుప్రీం ఆదేశాలను పాటించేలా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. కులం, మతం, వర్గం, లింగబేధం  తదితర అంశాల్లో ఏ సైనికుడి పట్లా వివక్షత ఉండబోదని స్పష్టంచేశారు. 1993 నుంచే సైన్యంలోకి మహిళా అధికారులను సైన్యంలోకి ఎంపికచేయడం ప్రారంభించామన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించేలా  తొలి బ్యాచ్‌లో 100 మంది మహిళలతో మిలటరీ పోలీస్‌ సెంటర్‌, పాఠశాలలో శిక్షణ ప్రారంభించినట్టు చెప్పారు. 

దేశానికి సేవచేయాలనే విషయంలో మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు తగ్గుతున్నాయని చెప్పారు. ఉగ్ర గ్రూపులపై సైన్యం ఒత్తిడి పెంచిందని చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదం తగ్గడానికి బాహ్యకోణం కూడా ఉందని ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో నరవణె వ్యాఖ్యానించారు. ఆప్తమిత్రుడిగా ఉన్న చైనా ఎల్లకాలం ఆదుకోలేమని పాక్‌ గ్రహించిందనీ.. ఇప్పటికైనా పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద నిరోధక చర్యలు పాటించడంలో పాక్‌ విఫలమవుతోంది గనకే ఎఫ్‌ఏటీఎఫ్‌ మళ్లీ గ్రే లిస్ట్‌లోనే ఉంచిందని చెప్పారు. కశ్మీర్‌లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థతతో  భద్రతాదళాలు ఉన్నాయని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని