‘కరోనా నిర్బంధం’లో 76 కోట్ల మంది..!

చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. జనసంచారంపై ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు కఠినతరం చేస్తోంది........

Published : 17 Feb 2020 11:49 IST

 

బీజింగ్‌: చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. జనసంచారంపై ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను కఠినతరం చేస్తోంది. తొలుత కొవిడ్‌-19(కరోనా వైరస్‌)కి కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగరానికే పరిమితైమన ఈ ఆంక్షలు క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి. దాదాపు 76 కోట్ల మంది నిర్బంధం పరిధిలోకి వచ్చారు. ఇది ఆ దేశ జనాభాల్లో సగం. ప్రపంచ జనాభాలో పదిశాతం. వీరిలో కొంతమంది పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి వస్తే మరికొంత మంది పాక్షిక నిర్బంధంలో కొనసాగుతున్నారు.

లక్షలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లోకి  రాకుండా వారిని అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్‌స్టాండ్‌లు సహా రద్దీ ఉండే ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, శరీర ఉష్టోగ్రత పసిగట్టే యంత్రాలతో సిబ్బంది నిరంతరం పహారా కాస్తున్నారు. స్థానికులు అదీ నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవడానికైతే తప్ప జనాల్ని బయటకు అనుమతించడం లేదు. 

అపార్టుమెంట్లు, హౌసింగ్‌ కాంప్లెక్స్‌ల్లో ఎవరు, ఎప్పుడు, ఎన్నిసార్లు బయటకు వెళుతున్నారు.. ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ లాగ్‌ పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అద్దెకుండేవారు ఎవరైనా వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళితే ఇంటి యజమానులు వారిని తిరిగి అనుమతించడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వా దేశాలు సహా వీధుల్లో ఎవరికివారు స్వీయ నిబంధనలు విధించుకుంటున్నారు. ఎవరికివారే రాకపోకలపై నిర్దిష్టమైన ఆంక్షలు పాటిస్తున్నారు. అయితే, ప్రాంతాన్ని బట్టి ఈ ఆంక్షల తీవ్రత మారుతోంది. 

వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచడంతో వారు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఇతర ప్రాంతాలతో పోటీపడి మరీ ఆంక్షల్ని అమలు చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా ఉండే స్థానిక కమిటీలే క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాయి. వైరస్ కట్టడి బాధ్యతల్ని వీరికి అప్పగించిన ప్రభుత్వం ప్రతివ్యక్తిపై నిఘా ఉంచేలా ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు చైనా, హాంకాంగ్‌లో ఆంక్షలతో ప్రజల నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్నారు. హాంకాంగ్‌లో ఆదివారం ఆయుధాలతో వచ్చి మరీ కొంతమంది దుకాణాల్లో టాయిలెట్ పేపర్లు, డైపర్లు, వంట సామగ్రి దొంగిలించారు. ఈ ఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా మాస్కుల తయారీ ఊపందుకున్నప్పటికీ.. డిమాండ్‌కు సరిపడా అందట్లేదని తెలుస్తోంది. వుహాన్‌ సమీపంలో ఉన్న ఓ కంపెనీ ఇటీవల మాస్క్‌ తయారీ యంత్రాల్ని ప్రత్యేకంగా తయారు చేసింది. ఒక్కోయంత్రం రోజుకు 40 వేల నుంచి 50 వేల మాస్క్‌లు ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 27 నాటికి మరో 10 యంత్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని