కొవిడ్‌-19తో మరో 143 మంది మృతి

చైనాలో కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 1,631 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజు 143 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు..........

Updated : 15 Feb 2020 11:15 IST

బీజింగ్‌: చైనాలో కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 1600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజు 143 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 139 మంది వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే. ఇదే రాష్ట్రంలో మరో 2,420 మంది కొత్తవారికి వైరస్‌ సోకడంతో దేశవ్యాప్తంగా కొవిడ్-19 బారిన పడ్డవారి సంఖ్య తాజాగా  2,641గా నమోదైంది. దీంతో ఇప్పటి వరకు మహమ్మారితో బాధపడుతున్న వారి సంఖ్య 66,492కు చేరింది. హుబెయ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య క్రమంగా పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ని కట్టడి చేయడానికి అత్యాధునిక బిగ్‌ డేటా, కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతను వినియోగించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. వుహాన్‌ ఆసుపత్రుల్లో వైరస్‌ బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం రోబోలను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చైనా వెలుపల బాధితుల సంఖ్య 580కి చేరింది. 

ఒడిశాలో 83 మందిపై పర్యవేక్షణ...

ఇటీవల చైనా సహా కొవిడ్‌-19 బారిన పడ్డ ఇతర దేశాల నుంచి వచ్చిన దాదాపు 80 మందిని ఒడిశా ప్రభుత్వం ఇళ్లకే పరిమితం చేసింది. వీరంతా జనవరి 15 తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన వారని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

జపాన్‌ నౌకలో భారతీయులను బయటకు తెచ్చేందుకు యత్నాలు..

జపాన్‌కు చెందిన విహార నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో ఉన్న భారతీయుల్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. వైద్య పర్యవేక్షణ ముగిసిన వెంటనే వారందర్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జపాన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు సహా నౌకలో 218 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడ్డ ముగ్గురు భారతీయుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. 

* కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఈసారి ప్రేమికుల దినోత్సవంపైనా పడింది. ఏటా ఉత్సాహంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకొనే హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి ప్రాంతాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మాస్కులు ధరించే ప్రేమికులు అక్కడక్కడ వీధుల్లో కనిపించారు. ఆరోజు డిమాండ్‌ ఎక్కువగా ఉండే గులాబీ పూల మార్కెట్లన్నీ ఈసారి వెలవెలబోయాయి.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని