అపరిశుభ్రచేతులే అంటువ్యాధులకు కారణం

బోస్టన్‌: ప్రయాణంలో తమ చేతులు శుభ్రపరుచుకోవడం వలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారిలో కేవలం పదిశాతం మంది శుభ్రత పాటించినా..ఫలితంగా అంటువ్యాధుల వ్యాప్తిని దాదాపు 24శాతం తగ్గించవచ్చని అంటున్నారు శాస్ర్తవేత్తలు.

Updated : 11 Feb 2020 23:32 IST

విమాన ప్రయాణికుల పరిశుభ్రతతో అంటువ్యాధుల నియంత్రణ అంటున్న పరిశోధకులు

 

బోస్టన్‌: ప్రయాణంలో తమ చేతులు శుభ్రపరుచుకోవడం వలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారిలో కేవలం పదిశాతం మంది శుభ్రత పాటించినా..ఫలితంగా అంటువ్యాధుల వ్యాప్తిని దాదాపు 24శాతం తగ్గించవచ్చని అంటున్నారు శాస్ర్తవేత్తలు. విమానాశ్రయాల్లో ఎంత ఎక్కువ మంది వారి చేతులు శుభ్రపరుచుకుంటారో..అంత ఎక్కువగా వ్యాధి వ్యాప్తి తీవ్రతను తగ్గించవచ్చని అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీకి చెందన పరిశోధకులు చెబుతున్నారు.

కరోనావైరస్‌ విజృంభనకు ముందే రిస్క్‌ అనాలిసిస్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనా పత్రంలో..సాధారణ వైరస్‌ల గురించి పేర్కొన్నప్పటికీ..కరోనా వైరస్‌ల వంటి వైరస్‌ల వ్యాప్తికి అపరిశుభ్ర చేతులే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాలల్లో ప్రయాణికులు దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా చాలా తేలికగా తీసుకుంటున్నారని తెలిపారు. 

విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ప్రయాణాల సమయంలో కేవలం 20శాతం మంది ప్రయాణికులు మాత్రమే తమ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకుంటున్నారు. మిగతా 80శాతం మంది విమానాశ్రయాల్లోని కుర్చీలు, టాయిలెట్ల తలుపులు, బ్యాగు తనిఖీ ప్రదేశాలను ముట్టుకోవడంతో వారి చేతులకు ఉండే సూక్ష్మజీవులతో అవి మరింత కలుషితం అవుతున్నాయని తెలిపారు. ఇక టాయిలెట్‌కి వెళ్ళివచ్చే వారిలో కేవలం డెబ్బైశాతం మంది తమ చేతులను శుభ్రం చేసుకుంటుండగా..వీరిలో సగం మంది మాత్రమే సక్రమంగా తమ చేతులను శుభ్రం చేసుకుంటున్నారని సిప్రస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.క్రిస్టోస్‌ నికోలేడ్స్‌ పేర్కొన్నారు. ఇక మిగతా ముప్పై శాతం మంది అసలు శుభ్రతే పాటించడం లేదని తెలిపారు.

ఒకవేళ ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు శుభ్రత పాటిస్తే..విశ్వవ్యాప్తంగా దాదాపు 70శాతం వ్యాధులను వివిధ దేశాలకు వ్యాప్తిచెందకుండా నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాధి బయటపడిన వెంటనే సమీపంలోని దాదాపు పది విమానాశ్రయాల్లో ఈ నిబంధనలు పాటిస్తే వ్యాధి వ్యాప్తి తీవ్రతను మరింత అరికట్టవచ్చని సూచించారు. కేవలం ఆ సమయంలో విమాన ప్రయాణికులను పరిశుభ్రతపై అప్రమత్తం చేయడం వలన దాదాపు 37శాతం వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. వివిధ దేశాల మధ్య దూరం, వాటి మధ్య సేవలందించే విమానాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. అంతేకాకుండా విమానాశ్రయాల్లో ప్రయాణికులు వేచి ఉండే సమయం, ఆ సమయంలో వేరే దేశాల ప్రజలతో చేసే సంభాషణలను పరిగణలోకి తీసుకున్నారు. 

అయితే బహిరంగ ప్రకటనలతో ప్రయాణికులను చైతన్యపరచడం, పోస్టర్లు అంటించడం, చేతులు శుభ్రపరుచుకోడానికి తగిన సౌకర్యం కల్పించడం వంటి చర్యలతో దీన్ని అమలుచేయచ్చని అంటున్నారు. ఇలాంటి చర్యలతో చేతులు శుభ్రపరుచుకొనే అవకాశాలు మెరుగవుతాయని పలు పరిశోధనలు రుజువుచేశాయని గుర్తుచేశారు. చేతుల శుభ్రతతో అత్యంత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలను ఉదహరించారు పరిశోధకులు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని