వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాస్క్‌ ధరించాలా..?

పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాత్రం ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కు లేకుండా మాట్లాడుకోవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) సూచిస్తోంది.

Published : 10 Mar 2021 19:00 IST

సీడీసీ ఏం చెబుతోందంటే..

వాషింగ్టన్‌: కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. వైరస్‌ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకు ప్రజలు మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు స్పష్టంచేస్తున్నారు. అయితే, పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాత్రం ఇండోర్‌ ప్రాంతాల్లో మాస్కు లేకుండా మాట్లాడుకోవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) సూచిస్తోంది. భారీ సమూహాలు, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ‌ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాలను సీడీసీ సవరించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో తీసుకున్న వారు, వ్యాక్సిన్ తీసుకోని కుటుంబ సభ్యులతో మాస్కులు లేకుండా నేరుగా మాట్లాడవచ్చని సీడీసీ డైరెక్టర్‌ రొషెల్లే వాలెన్‌స్కై వెల్లడించారు. తీవ్ర లక్షణాలు కనిపించని (వైరస్‌ సోకిన) రోగులతో మాట్లాడితే కూడా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష అవసరం లేదన్నారు. కేవలం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో ఇండోర్‌ ప్రాంతంలో ఉన్నప్పుడే మాస్కు మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందినవారితో కాకుండా ఇతరులతో సమూహాలుగా ఏర్పడే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు అధికంగా ఉన్న వ్యక్తులను కలిస్తే తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. కొవిడ్ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా భారీ సంఖ్యలో సమూహాలుగా ఏర్పడడం, విదేశీ ప్రయాణాల వంటివి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచించారు. అమెరికాలో పాఠశాలలు, వాణిజ్య సంస్థలు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ సీడీసీ ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

అమెరికాలో ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉండగా, జాన్సన్ అండ్‌ జాన్సన్‌ను ఒకే డోసు తీసుకుంటే సరిపోతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొవిడ్‌ వ్యాక్సిన్‌లన్నీ దాదాపు రెండు డోసుల్లో తీసుకోవాల్సినవే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని