Updated : 16/06/2021 17:42 IST

ITER: దాని ఆకర్షణకు నౌకలూ ఎగురుతాయి..!

ఫ్రాన్స్‌కు పయనమైన భారీ అయస్కాంతం

ఇంటర్నెట్‌డెస్క్‌ : సురక్షితమైన విద్యుత్తు ఉత్పత్తి కోసం చేపట్టిన ఐటీఈఆర్‌ ప్రాజెక్టులో భారీ ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు మధ్య భాగంలో ఉపయోగించేందుకు అతిపెద్ద అయస్కాంతాన్ని సిద్ధం చేశారు. అమెరికాలోని జనరల్‌ అటామిక్స్‌ సంస్థ దీనిని ఫ్రాన్స్‌కు రవాణా చేయడానికి సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఇంత భారీ అయస్కాంతం ఎక్కడా లేదు. ఇప్పటికే ఐటీఈఆర్‌ ప్రాజెక్టు 75శాతం పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పలు అత్యాధునిక పరికరాలు గత 15 నెలలుగా ఫ్రాన్స్‌కు చేరుకోవడం మొదలైంది.  
ఇక ఈ అయస్కాంతం 59 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇలాంటివి ఆరు మాడ్యూల్స్‌ వినియోగిస్తారు. ఇది ఐటీఈఆర్‌లోని ప్లాస్మాలో విద్యుత్తును ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఫ్యూజన్‌ రీయాక్షన్‌ను అదుపు చేయడానికి కూడా వినియోగిస్తున్నారు. ఇది భారీ విమాన వాహక నౌకను కూడా అలవోకగా ఆరు అడుగులు ఎత్తగలదు. దీని శక్తి అత్యధికంగా 13 టెస్లాలకు చేరుకొంటుంది.  భూమి కంటే ఇది 2,80,000 రెట్లు ఆకర్షణ శక్తి కలిగి ఉంది. ప్రత్యేక లోహాలతో చేసిన 5 కిలోమీటర్ల పొడవైన తీగతో రెండేళ్లపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. 

ఈ ఏడాది జనవరిలో జనరల్‌ అటామిక్స్‌ తొలి మాడ్యూల్‌ ప్రయోగ పరీక్షలు పూర్తి చేసింది. ఈ వారం దీనిని ప్రత్యేకమైన ట్రక్కులో లోడ్‌చేసి హ్యూస్టన్‌ నుంచి ఓడ రేవుకు చేరుస్తారు. అక్కడి నుంచి నౌకలో దీనిని తరలించనున్నారు. జనరల్‌ అటామిక్స్‌ చేపట్టిన అతి భారీ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటని సంస్థ ఇంజినీరింగ్‌ విభాగపు డైరెక్టర్‌ జాన్‌ స్మిత్‌ తెలిపారు. మిగిలిన మాడ్యూల్స్‌ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. రెండో మాడ్యూల్‌ను ఆగస్టులో సరఫరా చేస్తారని అనుకొంటున్నారు. 

ఐటీఈఆర్‌ ప్రాజెక్టు అంటే..?

ఐటీఈఆర్‌ అంటే ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పర్‌మెంటల్‌ రీయాక్టర్‌ అని అర్థం. న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యం. సూర్యుడిలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే విధానాన్ని పోలి ఉంటుంది. దీనిలో ఐరోపా సమాఖ్య,జపాన్‌,భారత్‌,చైనా,రష్యా,దక్షిణ కొరియా,అమెరికా, స్విట్జర్లాండ్‌లు సభ్య దేశాలు. 20 బిలియన్‌ యూరోలు దీనికి ఖర్చవుతాయని అంచనా. సాధారణంగా పరికరాల రూపంలోని వ్యయాలను పంచుకొంటాయి.  దీనిని చాలా రహస్యంగా నిర్వహిస్తున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని ఒక భాగంలో ఈ ప్రాజెక్టు సైట్‌ ఉంది.  

హైడ్రోజన్‌ ఫ్యూజన్‌ దేనికి..

హాని రహిత ఉద్గారాలతో విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్‌ ఫ్యూజన్‌ అత్యుత్తమమైన విధానం. దీనిలో హీలియం మాత్రమే ఉపఉత్పత్తిగా వస్తుంది. నిరంతరం విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటి వరకు దీని నుంచి ఎటువంటి గ్రీన్‌హౌస్‌గ్యాస్‌లు, రేడియో యాక్టివ్‌ పదార్థాలు వెలువడలేదు.   

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని