Farmers Protest: రైతు నిరసనకారులపై తీవ్ర వ్యాఖ్యలు.. భాజపా ఎంపీ వాహనం ధ్వంసం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిరసనకారుల విషయంలో భాజపా రాజ్యసభ ఎంపీ రాంచందర్ జాంగ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. వారిని ఆయన పనీపాట లేని మందుబాబులుగా అభివర్ణించారు...

Published : 05 Nov 2021 23:05 IST

చండీగఢ్‌: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిరసనకారుల విషయంలో భాజపా రాజ్యసభ ఎంపీ రాంచందర్ జాంగ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వారిని ఆయన పనీపాట లేని మందుబాబులుగా అభివర్ణించారు. దీంతో శుక్రవారం హరియాణా హిస్సార్‌ జిల్లాలోని నార్‌నౌంద్‌లో ధర్మశాల ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు.. రైతుల నిరసన సెగ తగిలింది. భారీ ఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్న వారు నల్ల జెండాలు పట్టుకుని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకూ మధ్య జరిగిన తోపులాటలో.. ఎంపీ కారు ధ్వంసమైంది. అంతకుముందు రైతులను నిలువరించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా.. అదుపు చేయలేకపోయారు. ఎంపీ తరఫున ఆయన మద్దతుదారులూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

‘రైతులతో కఠినంగా వ్యవహరించండి’

రోహ్‌తక్‌లో గురువారం దీపావళి వేడుకలకు హాజరైనప్పుడు కూడా జాంగ్రాకు ఇదే విధమైన అనుభవం ఎదురైంది. దీంతో కార్యక్రమం అనంతరం ఆయన రైతులపై విరుచుకుపడ్డారు. నిరసనలు చేస్తున్న వారిలో రైతులెవరూ లేరని.. వారంతా పనీపాటలేని మందుబాబులని వ్యాఖ్యానించారు. ‘వ్యవసాయ చట్టాలకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆందోళనల్లో పాల్గొంటున్నవారు.. ఎప్పుడూ ఇలాంటి చెడ్డ పనులు చేసేవారే. ఇటీవల సింఘు సరిహద్దులో ఓ అమాయకుడి హత్య ఘటనతో వారి ప్రవర్తన వెల్లడైంది. నేను రెగ్యులర్‌గా దిల్లీకి వెళ్తూనే ఉన్నాను. అక్కడ చాలా టెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది’ అని పేర్కొన్నారు. రైతులతో కఠినంగా వ్యవహరించాలని, నిరసనలు చేయకుండా ఆపాలని ప్రజలకూ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్‌ కావడంతో.. శుక్రవారం హిస్సార్‌లో నిరసనకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు కొంత మంది రైతులను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని