Farmers protest: రైతులపై లాఠీఛార్జీ.. సమర్థించుకున్న ఖట్టర్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న హరియాణా రైతులపై శనివారం పోలీసులు జరిపిన లాఠీఛార్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సమర్థించుకున్నారు. 

Published : 29 Aug 2021 23:35 IST

చండీగఢ్‌: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న హరియాణా రైతులపై శనివారం పోలీసులు జరిపిన లాఠీఛార్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సమర్థించుకున్నారు. పోలీసుల చర్యను ఆయన వెనకేసుకొచ్చారు. శాంతియుతంగా ఆందోళన చేస్తామన్న రైతులు పోలీసులపై రాళ్లు విసిరారని ఖట్టర్‌ అన్నారు. జాతీయ రహదారులను దిగ్బంధిచారని చెప్పారు. ‘‘వారు ఆందోళన చేయాలనుకుంటే శాంతియుత మార్గంలో చేసుకోవచ్చు. దానికెవరూ అడ్డుచెప్పరు. కానీ, పోలీసులపై రాళ్లు రువ్వడం, జాతీయ రహదారులను దిగ్బంధించడం వంటివి చేయడంతో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది’’ అని ఖట్టర్‌ అన్నారు.

హరిణాయాలో రానున్న మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ పరంగా సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆధ్వర్యంలో శనివారం కర్నాల్‌లో భాజపా సమావేశం జరిగింది. ఈ సమావేశం వద్దకు వెళ్లి కేంద్ర సాగు చట్టాలపై నిరసన తెలపాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) రైతులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడకు చేరేందుకు వెళ్లిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను పోలీసు శాఖ సైతం సమర్థించుకుంది. కొందరు రైతులు తమపై రాళ్లు రువ్వారని, వారిని చెదరగొట్టేందుకు స్వల్ప సంఖ్యలో పోలీసులను ఉపయోగించామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడినట్లు తెలిపారు. 

గాయపడి చికిత్స పొందుతున్న రైతులను ఆదివారం బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ పరామర్శించారు. రైతుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు రైతుల తలలు పగులగొట్టడంటూ పోలీసులకు కర్నాల్‌ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్‌ సిన్హా సూచనలిస్తున్న వీడియో విపరీతంగా వైరల్‌ అయిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. అతడిపై చర్యలుంటాయని డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని