Updated : 14/05/2021 16:54 IST

Israel-Palestine conflict: రెచ్చగొడుతున్న ఎర్డోగన్‌!

 ఘర్షణల్లోకి లెబనాన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ మోహరించింది. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన రాకెట్‌ దాడులు, వైమానిక దాడులు నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

గాజాలో 100 మంది మరణం.. 

మరోవైపు ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 100 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా పాలస్తీనా తరఫున హమాస్‌ ఉగ్రవాద సంస్థ  నిరంతరాయంగా రాకెట్లను వదులుతోంది. ఇప్పటి వరకు దాదాపు 1,750 రాకెట్లను ప్రయోగించినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ రాకెట్లలో 90 శాతాన్ని ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది.

ఇజ్రాయెల్‌లో అంతర్గత ఘర్షణలు..

ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ సహా మరికొన్ని నగరాల్లో అరబ్బులు, యూదుల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అంతర్గతంగానూ తీవ్ర ఘర్షణలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, అప్రమత్తమైన ప్రభుత్వం అల్లర్లను నియంత్రించేందు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. ఇప్పటి వరకు 400 మందిని అరెస్టు చేసింది. మరోవైపు  ఇజ్రాయెల్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్నింటిని ఇతర చోట్లకు మళ్లించారు. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌, అణు రియాక్టర్లున్న డిమోనా, జెరూసలెం లక్ష్యంగా హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్‌ దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు గాజాలోని నిఘా వ్యవస్థకు సంబంధించిన భవనాలు, పాలస్తీనా మిలిటరీకి సంబంధించిన స్థావరాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరుపుతోంది. 

రాజీకి విఫలయత్నం..

ఈ ఘర్షణలకు నిలువరించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధమైంది. ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు ఈజిప్టు విఫలయత్నం చేసింది. ఇరు దేశాల ప్రతినిధులు, హమాస్‌ ఉగ్రవాద నేతలతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి సహా అమెరికా తాజా పరిస్థితిపై పర్యవేక్షణకు సీనియర్‌ దౌత్యవేత్తలను పంపింది.

లెబనాన్‌ ఎంట్రీతో ప్రమాదకర సంకేతాలు..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణల్లోకి లెబనాన్‌ కాలుపెట్టినట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఘర్షణలు విపరీత పరిస్థితులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ వైపు గురువారం సాయంత్రం మూడు రాకెట్లు దూసుకొచ్చినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఘర్షణలను ఉద్దేశించి ఇటీవల ఎర్డోగన్‌ ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా నిలవకపోతే.. ఇస్లాం దేశాలన్నింటికీ ప్రమాదం పొంచి ఉందంటూ అక్కరకు రాని జోస్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మద్దతునూ కోరే ప్రయత్నం చేశారు.  పుతిన్‌ మాత్రం ఐరాస సూచించిన సయోధ్యకు తాము మద్దతుగా నిలుస్తున్నామంటూ దౌత్యనీతిని ప్రదర్శించారు. 

ఎగదోస్తున్న ఎర్డోగన్‌.. ఇజ్రాయెల్‌కు మద్దుతగా బైడెన్‌ ప్రకటన 

మరోవైపు కొన్ని ఇస్లాం దేశాలు పాలస్తీనాకు అనుకూల ప్రకటనలు చేయడం ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యే ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించిన సౌదీ అరేబియా సైతం ఇజ్రాయెల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘అల్‌ అఖ్సా పవిత్రతపై ఇజ్రాయెల్‌ సామ్రాజ్యవాద దళాలు దాడి చేశాయి’’ అని సౌదీ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌, బహ్రెయిన్‌, యూఏఈ, ఇరాన్‌, కువైట్‌ సైతం ఇదే బాటలో పయనించాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తాము గాజాకు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ టర్కీ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పాలస్తీనియన్లకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓపక్క ఐరాస సమయమనం పాటించాలని ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేయగా.. మరోవైపు  ‘మౌనం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంతో సమానం’ అంటూ  ఎర్డోగన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకకపోతే విపరీత పరిణామాలు చోటుచేసుకోవచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రకటన చేయడంతో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని