ఎన్నికల వేళ బైక్‌ ర్యాలీలు.. ఈసీ కీలక ఆదేశాలు!

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌ తేదీకి 72గంటల ముందు ఆయా నియోజకవర్గాల్లో బైక్‌ ....

Published : 22 Mar 2021 16:47 IST

దిల్లీ: ఎన్నికలు జరిగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌ తేదీకి 72గంటల ముందు ఆయా నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలపై నిషేధం విధించింది. కొన్ని అసాంఘిక శక్తులు పోలింగ్‌ రోజున బైక్‌లను ఉపయోగించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో చీఫ్ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్లకు (సీఈవో)లకు ఆదేశాలు జారీచేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు రోజు లేదా పోలింగ్‌ రోజున ఓటర్లను బెదిరించేందుకు బైక్‌లను ఉపయోగించారన్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఈసీ పేర్కొంది.  దీన్ని పరిగణనలోకి తీసుకొని పోలింగ్‌ రోజుకు 72గంటల ముందు బైక్‌ ర్యాలీలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం పరిశీలకులతో పాటు అందరికీ చెప్పాలని, అలాగే, ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా చూడాలని సూచించింది.

ఈ నెల 27నుంచి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి బెంగాల్‌, అసోంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 6న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో పోలింగ్‌ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని