పాకెట్‌ మనీగా ₹13కోట్లు.. వద్దంటోన్న రాకుమారి!

ఈ కాలం టీనేజీ పిల్లలకు పాకెట్‌ మనీ ఎంత ఇచ్చినా సరిపోదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త గ్యాడ్జెట్ల కొనుగోలు, స్నేహితులతో పార్టీలు, షికార్లు అబ్బో ఇలా ఎన్ని ఖర్చులో..! అందుకే పాకెట్‌ మనీ ఇచ్చినా మళ్లీ మళ్లీ ఖర్చుల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడుగుతుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి

Updated : 15 Jun 2021 19:21 IST


(Photo: Koninklijk Huis Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ కాలం టీనేజీ పిల్లలకు పాకెట్‌ మనీ ఎంత ఇచ్చినా సరిపోదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త గ్యాడ్జెట్ల కొనుగోలు, స్నేహితులతో పార్టీలు, షికార్లు అబ్బో ఇలా ఎన్ని ఖర్చులో..! అందుకే పాకెట్‌ మనీ ఇచ్చినా మళ్లీ మళ్లీ ఖర్చుల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడుగుతుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి వారి ఖర్చులు వేర్వేరుగా ఉంటాయనుకోండి.. కానీ, రాజవంశంలో పుట్టి.. తలుచుకుంటే ఏదైనా చెంతకు తెప్పించుకునేంత స్థాయి ఉన్న నెదర్లాండ్‌ రాకుమారి మాత్రం రూ.కోట్లు పాకెట్‌ మనీగా ఇస్తామంటుంటే సున్నితంగా తిరస్కరిస్తోంది.

రాచరికాలు కనుమరుగైనా.. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు రాజవంశీయులకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్‌ చక్రవర్తి విలియమ్‌ అలెగ్జాండర్‌ కుటుంబానికి కూడా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఏటా వేతనంగా భారీ మొత్తంలో డబ్బును చెల్లిస్తోంది. అదే రాజకుటుంబానికి ఆదాయ వనరుగా కొనసాగుతోంది. అయితే, వచ్చే డిసెంబర్‌లో చక్రవర్తి అలెగ్జాండర్‌ పెద్ద కుమార్తె ప్రిన్సెస్‌ అమాలియా 18వ వసంతంలోకి అడుగుపెట్టనుందట. దీంతో ఆమెకు కూడా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఏటా 1.9మిలియన్‌ యూఎస్‌ డాలర్లు(రూ.13.93కోట్లు) పాకెట్‌ మనీగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. 

అయితే, ఇటీవల పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చే ఏడాది కళాశాలలో చేరబోతున్న అమాలియాకు ఆ పాకెట్‌ మనీ తీసుకోవడం ఇష్టం లేదట. అందుకే ఆ డబ్బు నాకొద్దంటూ డచ్‌ ప్రధానికి లేఖ రాసింది. ‘‘అంత మొత్తంలో డబ్బు తీసుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తీసుకున్న డబ్బుకు న్యాయం చేసేలా ఇప్పట్లో ఏ సేవలు చేయలేను. అంతేకాదు, కరోనా సంక్షోభంలో నా తోటి విద్యార్థులు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో నేను ఆ డబ్బును తీసుకోలేను’’అని లేఖలో పేర్కొంది. చదువు పూర్తి చేసుకొని రాజవంశంలో అధికారికంగా తన విధుల్లో చేరేవరకు ఈ పాకెట్‌మనీని తీసుకునేది లేదని స్పష్టం చేసింది. డబ్బుతోనే అన్ని ముడి పడి ఉన్న ఈ కాలంలో అన్ని కోట్లను తిరస్కరించడం గొప్ప విషయమే కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని