Updated : 30/06/2021 12:12 IST

JK: జమ్ము సైనిక స్థావరాల వద్ద మళ్లీ డ్రోన్లు

నాలుగు రోజుల్లో 7 డ్రోన్ల సంచారం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం జమ్ము సైనిక స్థావరాలకు సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. నిన్న అర్ధరాత్రి 1.30 నుంచి ఈ తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి.

మొదట కాలుచూక్‌ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్‌ కన్పించగా.. ఆ తర్వాత కాసేపటికే రత్నచక్‌ సైనిక ప్రాంతంలో మరోదాన్ని గుర్తించారు. ఇక మూడోది.. కుంజ్వానీ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద కన్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్‌ ఇన్‌స్టాలేషన్స్‌ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. జమ్ము సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించడం గమనార్హం.

గత ఆదివారం  తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్ము వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ  రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్ములోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

మరోవైపు డ్రోన్‌ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే ప్రథమం. సరిహద్దు ఆవల నుంచి ఉత్పన్నమైన ఈ సరికొత్త ముప్పుతో అప్రమత్తమైన కేంద్రం తాజా పరిస్థితిని సమీక్షించింది. ప్రధాని మోదీ మంగళవారం దిల్లీలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో భేటీ అయ్యారు. దేశ భద్రతకు ఏర్పడే కొత్త సవాళ్లను దృఢంగా తిప్పికొట్టేందుకు సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్