Farmer's protest: దిల్లీకెళ్లి నిరసనలు చేయండి.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకండి

పంజాబ్‌లో రైతుల నిరసనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తొలిసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసన ప్రదర్శనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొనే వారు.. దిల్లీలోని...

Updated : 09 Dec 2021 16:40 IST

రైతుల నిరసనలపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ వ్యాఖ్యలు

చండీగఢ్‌: పంజాబ్‌లో రైతుల నిరసనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తొలిసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసన ప్రదర్శనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొనే వారు.. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై దృష్టి పెట్టాలని, రాష్ట్రాన్ని మినహాయించాలని కోరారు. హోషియార్‌పూర్ జిల్లాలోని ముఖ్లియానా గ్రామంలో సోమవారం ఓ ప్రభుత్వ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కెప్టెన్‌ ఈ మేరకు మాట్లాడారు. ‘ఈ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనుకుంటే.. మీ నిరసనలను దిల్లీకి మార్చండి. పంజాబ్‌ను మాత్రం ఇబ్బంది పెట్టకండి’ అని స్పష్టం చేశారు. కర్షకుల సంక్షేమానికి రాష్ట్రం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఇటీవల చెరకు పంటకు మద్దతు ధర సైతం పెంచినట్లు తెలిపారు.

గతేడాది నుంచి మొదలు..

ఎన్డీయే ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో అన్నదాతలు.. గతేడాది నవంబరు నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాలో మహా పంచాయత్‌లు నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తాము విశ్రమించబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయత్‌ అన్నారు. ప్రభుత్వాన్ని కూడా ప్రశాంతంగా ఉండనీయబోమని చెప్పారు. అమరీందర్‌ సింగ్‌ సైతం గతంలో రైతుల నిరసనలకు మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని