డెన్మార్క్‌లో కొవిడ్‌-19 పాస్‌పోర్టులు!

సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే ముందుగా స్వదేశంలో పాస్‌పోర్టు ఉండాలి. ఇకపై రెగ్యులర్‌ పాస్‌పోర్టుతోపాటు కొత్తగా ‘కొవిడ్‌-19 పాస్‌పోర్టు’ను తప్పనిసరి చేయనున్నట్లు డెన్మార్క్‌ ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌-19 పాస్‌పోర్టు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా

Published : 07 Feb 2021 22:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే ముందుగా స్వదేశంలో పాస్‌పోర్టు ఉండాలి. ఇకపై రెగ్యులర్‌ పాస్‌పోర్టుతోపాటు కొత్తగా ‘కొవిడ్‌-19 పాస్‌పోర్టు’ను తప్పనిసరి చేయనున్నట్లు డెన్మార్క్‌ ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్‌-19 పాస్‌పోర్టు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌లోనూ ప్రజలకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మాత్రమే ఈ పాస్‌పోర్టులు మంజూరు చేసి విదేశాలకు వెళ్లడానికి అనుమతివ్వనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

కరోనా కట్టడిలో భాగంగా డెన్మార్క్‌లో ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అత్యవసర సేవలు, పరిమిత సంఖ్యలో ఇతర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విదేశాలకు వెళ్లడానికి అక్కడి ప్రజలకు ఇంకా పూర్తిగా అనుమతులు ఇవ్వలేదు. అయితే, కరోనా వ్యాక్సిన్స్‌ మార్కెట్లోకి రావడంతో ప్రజలకు విదేశీ ప్రయాణాలకు అనుమతివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, కరోనా వ్యాప్తిని నియంత్రించే బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే ‘కొవిడ్‌-19 పాస్‌పోర్టు’ను తెరపైకి తీసుకొచ్చింది. ఎవరైతే కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటారో వారు.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి డిజిటల్‌ రూపంలో కొవిడ్‌-19 పాస్‌పోర్టును పొందొచ్చు. దీనిని చూపిస్తేనే డెన్మార్క్‌ ప్రజలకు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పాస్‌పోర్టును ఈనెల చివరినాటికి రూపొందిస్తామని, మంజూరు చేయడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ‘‘ఇది మన, మన దేశ క్షేమం గురించే. మన వద్ద ఉన్న సాంకేతికతను వినియోగించి దీన్ని రూపొందిస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలో కొవిడ్‌-19 పాస్‌పోర్టును తీసుకొచ్చిన తొలి దేశం మనదే అవుతుంది’’అని డెన్మార్క్‌ ఆర్థిక శాఖ మంత్రి మొర్టెన్‌ బొయెడ్‌స్కావ్‌ తెలిపారు. 

ఇవీ చదవండి..

మహమ్మారుల ఒత్తిడి.. వీరిపైనే ఎక్కువట!

అతడికి కరోనా గురించి తెలియదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని