Corona: డెల్టా ప్లస్‌ ‘మహా’ కలవరం.. వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని మహమ్మారి‌!

మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నా ఈ వైరస్‌ వదలడంలేదు. ......

Published : 16 Aug 2021 20:33 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నా ఈ వైరస్‌ వదలడంలేదు. గడిచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్తగా మరో 10 డెల్టా ప్లస్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం డెల్టా ప్లస్‌ రకం  కేసుల సంఖ్య 76కి పెరిగింది. ఈ రకం వైరస్‌ సోకినవారిలో పది మంది వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకోగా.. 12మందికి తొలి డోసు పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, డెల్టా ప్లస్‌ సోకడంతో రాష్ట్రంలో ఐదుగురు మరణించగా.. వారిలో ఇద్దరు వ్యాక్సిన్‌ పూర్తయినవారే ఉండటం గమనార్హం. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

పుణె, సతారా, కొల్హాపూర్‌, సోలాపూర్‌, సంగ్లి, అహ్మద్‌నగర్‌, రత్నగిరి జిల్లాల్లో కొత్త కేసులు వస్తున్నందున పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 4800 కొత్త కొవిడ్‌ కేసులు రాగా.. 130 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ ఇంకా పోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజల్ని హెచ్చరించారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగించిన ఆయన కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగితే లాక్‌డౌన్‌ తప్పదని కూడా హెచ్చరించారు. ఇతర దేశాల్లో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌లు వస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని