Breath Analyser: నిమిషంలో కొవిడ్‌ ఫలితం!

నోటి నమూనాలతో (బ్రీత్‌ అనలైజర్‌) కొవిడ్‌ నిర్ధారణ చేసే నూతన విధానానికి సింగపూర్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 19 Oct 2022 15:36 IST

అభివృద్ధి చేసిన సింగపూర్‌ అంకుర సంస్థ

సింగపూర్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత కొనసాగుతున్న వేళ.. వైరస్‌ను సాధ్యమైనంత త్వరగా గుర్తించే విధానాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నోటి నమూనాలతో (బ్రీత్‌ అనలైజర్‌) పరీక్షించే విధానానికి సింగపూర్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విధానంలో కేవలం ఒక్క నిమిషంలోనే కొవిడ్ ఫలితం తెలుస్తుందని కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ రూపకర్తలు వెల్లడించారు.

కొవిడ్‌ ఫలితాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో ఇచ్చే విధానాన్ని సింగపూర్‌ యూనివర్సిటీకి చెందిన బ్రెతోనిక్స్‌ అనే అంకురసంస్థ రూపొందించింది. నోటితో ఊదే ఈ ప్రక్రియలో వైరస్‌ అనుమానిత వ్యక్తి వాడిపడేసే మౌత్‌పీస్‌లోకి శ్వాసను ఊదాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన నమూనాలను అత్యాధునిక స్పెక్ట్రోమీటర్‌ పరికరం ద్వారా పరీక్షిస్తారు. తద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే వైరస్‌ నిర్ధారణ అవుతుందని రూపకర్తలు పేర్కొన్నారు. ఈ విధానం క్లినికల్‌ ట్రయల్స్‌ను 180 మంది బాధితులపై జరపగా.. 90శాతం కచ్చితత్వంతో ఫలితం వచ్చిందని తెలిపారు. దీంతో ఇప్పటికే సింగపూర్‌ ఆరోగ్యశాఖతో కలిసి సరిహద్దు ప్రాంతాల వద్ద కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు బ్రెతోనిక్స్‌ సంస్థ పేర్కొంది. ఇక ఇప్పటివరకు ఉందుబాటులో ఉన్న కొవిడ్ పరీక్షల్లో.. యాంటీజెన్‌ టెస్టులో 15 నిమిషాల్లోపు ఫలితం వస్తుండగా, ఆర్‌టీపీసీఆర్‌ ఫలితానికి కొన్ని గంటల సమయం పడుతుంది.

సింగపూర్‌లో కరోనా వైరస్‌ విజృంభణ అదుపులోనే ఉంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ 60వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం వరకు అక్కడ వైరస్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ గడిచిన రెండు, మూడు వారాలుగా అక్కడక్కడ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని