Updated : 05/06/2021 14:57 IST

Corona: బ్రెజిల్‌ పిల్లల్లో అన్ని మరణాలెందుకు..?

బ్రెసిలియా: మనదేశంలో కరోనా వైరస్ మొదటి దశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం లేదు. రెండోదశలో కొద్దిమేర దాని తీవ్రత కనిపించింది. మూడోదశలో దాని ముప్పు తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా విషయంలో చిన్నారుల గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బ్రెజిల్‌ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి పిల్లల్లో కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ‘వైటల్ స్ట్రాటజీస్‌’ అనే ఎన్జీఓ దీనిపై అధ్యయనం చేసింది. 

ఇప్పటివరకు సుమారు 4,67,000 మంది బ్రెజిల్‌ దేశీయులు కరోనావైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 0.5 శాతం, అంటే 2,200 కంటే ఎక్కువే చనిపోయారు. ఐదేళ్ల లోపువాళ్లలో 900కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో కరోనా మరణాల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 6 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. అందులో 113 మరణాలు ఐదేళ్లలోపు చిన్నారులవి. ఈ లెక్కన చూసుకుంటే కరోనా కారణంగా బ్రెజిల్‌లోని చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు విడిచారు. బ్రెజిల్‌లో అధిక జనాభా ఉన్న సావ్ పాలో నగరంలో వైటల్ స్ట్రాటజీస్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. 2020 చివరి నుంచి కౌమార వయస్కులు, చిన్నారుల్లో నమోదవుతున్న కేసులు పెరగడంతో పాటు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా ఎక్కువైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్లలోపువారితో సహా శిశువులు కూడా ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది.  

ప్రారంభ రోజుల్లో పెద్దలతో పోల్చుకుంటే చిన్నారుల్లో వైరస్‌ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే బ్రెజిల్‌ పిల్లల్లో చోటుచేసుకున్న మరణాలతో పరిశోధకులు దీనికి కారణాలను అన్వేషిస్తున్నారు. రానున్న రోజుల్లో వైరస్ తీరుతెన్నులు ఏవిధంగా ఉండొచ్చనే అంశాలను పరిశీలిస్తున్నారు. బ్రెజిల్‌లో మొదట గుర్తించిన కరోనా రకం పీ.1(గామా) సంక్రమణ అక్కడ వేగంగా ఉంది. అది యాంటీబాడీలను పాక్షికంగా తప్పించుకొని వ్యాప్తి చెందగలదని తెలుస్తోంది. ఈ తరహా వైరస్‌ మ్యుటేషన్లే పిల్లల్లో తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు. అమెరికాలో కూడా ఈ గామా వేరియంట్ ఉనికి చాటుతోంది. అక్కడ మొత్తం కేసుల్లో ఏడు శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని అంచనా. ఇది చిన్నారులు, శిశువులపై ప్రభావం చూపుతుందేమోనని భావిస్తున్నారు. అలాగే అక్కడ మూడింట రెండు వంతుల కేసులకు ఆల్ఫా వేరియంట్ కారణమని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు గామా ఉద్ధృతి కూడా తీవ్ర స్థాయిలో ఉందన్నారు. దాంతో టీకాల పనితీరు కీలకంగా మారనుంది. బూస్టర్‌ డోసులు, చిన్నారులకు టీకాల ఆమోదం వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. అలాగే పిల్లల్లో కొవిడ్‌ ముప్పుపై వైద్య సిబ్బందికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది.  

ఇదిలా ఉండగా.. బ్రెజిల్‌లో కొవిడ్ సంక్షోభానికి కారణం కట్టడి చర్యల్లో వైఫల్యం, టీకా సరఫరా సరిగా లేకపోవడమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్లు పుట్టుకొని వస్తుండటంతో బ్రెజిల్‌తో సహా, భారత్‌, కాంగో వంటి దేశాల్లో కరోనా కల్లోలం బయటపడుతోంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం సమయానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే చిన్నారులు ఎలా ఇబ్బంది పడతారో బ్రెజిల్ అనుభవం తెలియజేస్తోందని చెబుతున్నారు.

మరోవైపు, బ్రెజిల్‌లో 2007, 2008 మధ్యలో చిన్నారులను డెంగీ ఇబ్బంది పెట్టింది. మొత్తం మరణాల్లో సగం కంటే ఎక్కువ పసిపిల్లలవే. అలాగే 2015లో జికా వైరస్ వెలుగుచూసింది. ఆ సమయంలో దాని బారిన పడిన గర్భిణులు.. మైక్రోసెఫాలీ వంటి జనన లోపాలతో ఉన్న బిడ్డలకు జన్మనిచ్చారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇతర పరాన్న జీవులు అక్కడి పిల్లల్లో ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ఇది ఆ దేశంలోని పేద గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని