పంజాబ్‌లోనూ రాత్రి కర్ఫ్యూ!

వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది.

Published : 07 Apr 2021 16:23 IST

కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో..

ఛండీగఢ్‌: పంజాబ్‌లోనూ కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. రాష్ట్రంలో బయటపడుతోన్న పాజిటివ్‌ కేసుల్లో 80శాతం కేసులు బ్రిటన్ రకానివే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని.. ఈ సమయంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించడంతో పాటు మాల్స్‌, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో జనసంచారంపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీల్లో రాత్రి కర్ఫ్యూ ప్రకటించగా తాజాగా పంజాబ్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

దేశంలో గడిచిన నెలరోజులుగా కరోనా వైరస్‌ ఉద్ధృతి మళ్లీ పెరిగింది. నిత్యం కొత్తగా దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే లక్షా 15వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 55వేల కేసులు నమోదుకాగా, పంజాబ్‌లో మాత్రం దాదాపు 3వేల కేసులు వెలుగు చూశాయి. అయితే, పంజాబ్‌లో నమోదవుతున్న కేసుల్లో 80శాతం బ్రిటన్‌ రకానివేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున..అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

మూడు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా..

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత మరోసారి కొనసాగుతున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉందని.. వైరస్‌ కట్టడికి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. అంతేకాకుండా అక్కడ పరిస్థితి సమీక్షించేందుకు ప్రత్యేక కేంద్ర బృందాలను కూడా కేంద్ర ఆరోగ్యశాఖ పంపింది. ఇప్పటికే మహారాష్ట్ర రాత్రి కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు వారాంతంలో పూర్తి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. దేశ రాజధాని దిల్లీలోనూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్‌లోనూ దాదాపు 20 ప్రధాన నగరాల్లో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని