Sri Lanka: సిలిండర్‌ ధర ₹2,657.. కేజీ పాలపొడి ₹1,195

ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమన్నాయి. అత్యవసర ఆహార పదార్థాలపై ధరల

Updated : 11 Oct 2021 22:09 IST

శ్రీలంకలో ‘ధరా’ఘాతం.. చుక్కలను తాకిన నిత్యావసరాలు 

కొలంబో: ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమన్నాయి. నిత్యావసర ఆహార పదార్థాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి ₹657కు చేరింది. ఇక కేజీ పాలపొడి ధర ఐదు రెట్లు పెరిగి ₹1,195గా ఉంది. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 

ఎందుకీ ‘ధరా’ఘాతం..

గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాసిన్ని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.

సరఫరా తగ్గడంతో..

అయితే ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షత సమావేశమైన కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత శుక్రవారం ₹1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. ఇప్పుడు ₹2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల పొడి ధర ₹250 నుంచి ₹1195కు చేరింది. ఇవే కాదు.. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని