Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ ఖేరి ఘటన వీడియో వైరల్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విపక్షాలు, రైతుసంఘాల నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులను...

Updated : 05 Oct 2021 11:38 IST

నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు: ప్రియాంకా గాంధీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విపక్షాలు, రైతుసంఘాల నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, నిర్బంధించారు. నేతలెవరూ లఖింపుర్‌కు రాకుండా కట్టడి చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. నిరసన ప్రదర్శనలో ఉన్న రైతులపై రెండు వాహనాలు ఆగకుండా దూసుకెళ్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో రైతులంతా చెల్లాచెదురైనట్లు రికార్డయింది. కాంగ్రెస్‌ పార్టీ, ప్రియాంకా గాంధీ సైతం వేర్వేరుగా ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ఈ వీడియోను అధికారికంగా ధ్రువీకరించలేదు.

‘నిందితుడిని అరెస్టు చేయలేదు.. ఎందుకు?’

‘నరేంద్రమోదీ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు, ఎఫ్‌ఐఆర్‌ లేకుండా నన్ను 28 గంటలుగా నిర్బంధంలో ఉంచింది. కానీ.. రైతులపై వాహనాన్ని ఎక్కించిన ఆ వ్యక్తిని మాత్రం ఇంకా అరెస్టు చేయలేదు. ఎందుకు?’ అని ప్రియాంక ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ విషయమై రాహుల్‌గాంధీ.. ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. ‘ఎవరినైతే మీరు నిర్బంధించారో.. ఆమె భయపడదు. నిజమైన కాంగ్రెస్‌వాదులు.. ఓటమిని ఒప్పుకోరు. ఈ సత్యాగ్రహం ఆగబోదు’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు ప్రియాంక నిర్బంధంపై పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది మృతి చెందడంతో.. యూపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఘటనకు కారణమైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాను అరెస్టు చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు యూపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని