Updated : 17/11/2021 11:55 IST

China vs US: నాటికి నేటికీ ఎంత మార్పు..? అమెరికాను బెదిరించిన చైనా..!

* ఒకప్పుడు షీజిన్‌పింగ్‌ను ముఖం మీదే బెదిరించిన ట్రంప్‌.. 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి.. అంటే ఇదేనేమో. ట్రంప్ హయాంలో నేరుగా చైనాను బెదిరించగలిగిన అమెరికా పరిస్థితి.. జో బైడెన్‌ సమయం వచ్చే సరికి  తారుమారైంది. నేడు  అమెరికా-చైనా అధినేతల వర్చువల్‌ చర్చలను షీజిన్‌పింగ్‌ బలప్రదర్శనకు బాగా వాడుకొన్నారు. తైవాన్‌ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహించడమంటే నిప్పుతో చెలగాటమాడుకొన్నట్లే అని ఏకంగా బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు.

జోబైడెన్‌ ఆఫీస్‌లోకి వచ్చాక షీజిన్‌పింగ్‌తో వర్చువల్‌గా జరిగిన కీలక భేటీ ఇదే. తొలుత ఇద్దరు వ్యక్తిగత సంబంధాలను గుర్తు తెచ్చుకొన్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన వివాదాన్ని ప్రస్తావనకు తెచ్చినట్లు చైనా మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. సమావేశం సందర్భంగా షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘తైవాన్‌ కోసం అక్కడి అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం’’ అని పేర్కొన్నట్లు చైనా మీడియా పేర్కొంది. 

బైడెన్‌ మాత్రం జిన్‌పింగ్‌ ఆరోపణలను వ్యతిరేకించారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడాన్నివ్యతిరేకిస్తామని తెలిపారు.  ఒక్క తైవాన్‌ అంశంలో తప్ప మిగిలిన విషయాల్లో భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఆంకాంక్షించారు.

గతంలో ట్రంప్‌ దెబ్బకు బెదిరిపోయిన జిన్‌పింగ్‌..!

2017 ఏప్రిల్‌ నెలలో చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటించారు. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు  ఫ్లొరిడాలోని పామ్‌ బీచ్‌లో ఓ విలాసవంతమైన విడిది ఉంది. జిన్‌పింగ్‌కు అక్కడ ఆతిథ్యం ఇచ్చారు. 

అదే సమయంలో మరోపక్క సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ సేనలకు వ్యతిరేకంగా అమెరికా సంకీర్ణ సేనలు పోరాడుతున్నాయి. రష్యా ప్రోత్సాహంతో చైనా నుంచి బషర్‌ సర్కారుకు సాయం అందుతోందన్న అనుమానాలు అమెరికాలో ఉన్నాయి. బషర్‌ అల్‌ అసద్‌పై తీసుకొస్తున్న ఐరాస తీర్మానాలను తరచూ రష్యాతో కలిసి చైనా అడ్డుకుంటోంది. దీనికి తోడు అసద్‌ విషవాయువులను సిరియాలోని సొంత ప్రజలపై ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  దీంతో జిన్‌పింగ్‌ను హెచ్చరించడానికి  డిన్నర్‌ను వాడుకొన్నారు. 

ఆ సమయంలో ఏం జరిగింది..? 

ట్రంప్‌, జిన్‌పింగ్‌ భోజనం ముగించి చాక్లెట్‌ కేక్‌ తింటున్నారు. అదే సమయంలో ట్రంప్‌ నోటి నుంచి వచ్చిన మాటలకు జిన్‌పింగ్‌ అవాక్కయ్యారు. ‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌ మీకో విషయం చెబుతాను. ఇప్పుడే మేము 59 క్షిపణులను ప్రయోగించాం. అవి ఇరాక్‌ వైపు(పొరబాటున వచ్చిన మాట).. ఇప్పుడే సిరియావైపు వెళుతున్నాయి. మీకు ఆ విషయం తెలియాలి అనుకొంటున్నాను’’ అని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 10 క్షణాలపాటు ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న దుబాసీని పిలిచి  ట్రంప్‌ ఏమన్నారో మరోసారి చెప్పమని కోరారు. అనంతరం దుబాసీ చెప్పింది విన్నారు. 

అనంతరం జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. ‘‘ మీరు చెప్పినట్లు గానీ, ఇంకా ఏ విధంగానైనాగానీ ఎవరైన విషవాయువులను చిన్నపిల్లలు, పసికందులపై  ప్రయోగించడం రాక్షసత్వం. ఇట్స్‌ ఓకే’’ అని జిన్‌పింగ్‌ స్పందించారు. డిన్నర్‌ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడాన్ని చైనీయులు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.  మార్‌-ఎ-లాగో డిన్నర్‌ షీజిన్‌పింగ్‌కు చేదు  అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కూడా ట్రంప్‌ తన పదవీకాలం చివరి వరకు చైనాను ఇరుకునపెడుతూనే వచ్చారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని