China - India : ‘ఆఫ్గాన్‌’ చర్చలు... పాక్‌ను ఫాలో అయిన చైనా

ఆఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ను చైనా అనుసరిస్తోంది. అఫ్గాన్‌ పరిణామాలపై భారత్‌ తన వంతుగా నిర్వహిస్తున్న ‘ప్రాంతీయ భద్రతా చర్చలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి చైనా నిరాసక్తత వ్యక్తం చేసింది

Published : 09 Nov 2021 23:10 IST

దిల్లీ: ఆఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ను చైనా అనుసరిస్తోంది. అఫ్గాన్‌ ప్రస్తుత పరిణామాలపై భారత్‌ తన వంతుగా నిర్వహిస్తున్న ‘ప్రాంతీయ భద్రతా చర్చలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి చైనా నిరాసక్తత వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడి పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ ముందుకొచ్చి ఆసియా దేశాలతో ‘ప్రాంతీయ భద్రతా చర్చలు’ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆసియా దేశాలకు ఆహ్వానం పంపింది. 

 

నవంబర్‌ 10న దిల్లీ వేదికగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధ్యక్షతన ఈ చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు రష్యా, ఇరాన్‌, చైనా, పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలకు భారత్‌ ఆహ్వానం పంపింది. చైనా, పాకిస్థాన్‌ మినహాయించి రష్యా, ఇరాన్‌ సహా వివిధ దేశాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ఈ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు పాకిస్థాన్‌ ఇప్పటికే తెలిపింది. తాజాగా చైనా కూడా అలాంటి సమాధానమే ఇచ్చింది. షెడ్యూల్‌ కుదరకపోవడంతో చర్చలకు చైనా ప్రతినిధులు హాజరుకాలేరని డ్రాగన్‌ తెలిపింది. ఇప్పటికే తన సమాధానాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు కూడా చైనా చెబుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని